
జిల్లా అధ్యక్ష పదవి రేసులో కోటగిరి సతీష్ గౌడ్
భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో టేకుమట్ల మండలం ఏంపేడు గ్రామానికి చెందిన యువజన నాయకుడు, టేకుమట్ల కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ ముందంజలో ఉన్నారు.
గత 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పనిచేస్తూ, యువజన కాంగ్రెస్ నాయకుడిగా పార్టీకి నూతన తరాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించినట్లు సతీష్ గౌడ్ తెలిపారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తనతోపాటు అనేక మంది కాంగ్రెస్ కార్యకర్తలు అవమానాలు, అక్రమ కేసులు, ఆర్థిక మరియు మానసిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, పార్టీ పట్ల నిబద్ధత కోల్పోలేదని గుర్తు చేశారు. గ్రామ గ్రామాన పార్టీ బలోపేతానికి తాను చేసిన కృషిని ప్రజలు గుర్తించారన్నారు.
మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, డిసిసి అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి మార్గదర్శకత్వంలో, పీసీసీ ఇచ్చిన ప్రతీ కార్యక్రమాన్ని నిబద్ధతతో ముందుకు నడిపించానని చెప్పారు. టేకుమట్ల మండలాన్ని ఆర్గనైజేషన్ పరంగా జిల్లాలోనే ముందున్న మండలంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు.
2018 ఎన్నికల్లో గండ్ర వెంకటరమణారెడ్డిని గెలిపించడంలో కీలకపాత్ర పోషించి, ఆ తరువాత ఆయన పార్టీ మారినప్పుడు విరోధిస్తూ నిరసన కార్యక్రమాలు చేసిన వ్యక్తిగా తన పాత్రను గుర్తుచేశారు. పార్టీని ప్రాణంగా భావించి, అన్యాయ కేసులపై న్యాయపోరాటం కొనసాగిస్తున్న వ్యక్తిగా, పార్టీ పట్ల తన అంకితభావాన్ని గుర్తించి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరారు.
బీసీ సామాజిక వర్గానికి చెందిన సతీష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో తోడుగా నిలిచి, టేకుమట్ల మండలాన్ని జిల్లాలో చురుకైన కార్యకలాపాల కేంద్రంగా తీర్చిదిద్దిన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయనకు జిల్లా అధ్యక్ష పదవి రావాలని కాంగ్రెస్ అభిమానులు, యువకులు ఆకాంక్షిస్తున్నారు.
