
రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఈడీ వీధి దీపాలపై కఠిన పర్యవేక్షణ ఆదేశాలు : సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటుతో పాటు వాటి నిర్వహణలో పక్కాగా పర్యవేక్షణ ఉండాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం పంచాయతీ రాజ్, మున్సిపల్, జీహెచ్ఎంసీ విభాగాలపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామాల్లో అవసరమైనన్ని కొత్త ఎల్ఈడీ లైట్లు అమర్చడం, వాటి నిర్వహణ బాధ్యతలను సర్పంచులకే అప్పగించాలని స్పష్టం చేశారు. రాత్రిపూట లైట్లు వెలిగేలా, పగటిపూట దుర్వినియోగం కాకుండా పర్యవేక్షణ కచ్చితంగా ఉండాలని ఆదేశించారు. అన్ని గ్రామాల ఎల్ఈడీ డ్యాష్‌బోర్డు మండలస్థాయి ఎంపీడీవోలు, జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్లు పర్యవేక్షించాలని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 16.16 లక్షల ఎల్ఈడీ లైట్లు ఉన్నాయని అధికారులు వివరించారు. వరంగల్, నల్గొండ, జనగాం, నారాయణపేట జిల్లాల్లో ఎల్ఈడీ లైట్లు కాంట్రాక్టు ఏజెన్సీల ఆధ్వర్యంలో ఉన్నాయని పేర్కొన్నారు. వీటిని గ్రామ పంచాయతీల పరిధిలోకి తీసుకురావడం వల్ల నిర్వహణలో మెరుగులు వస్తాయని అభిప్రాయపడ్డారు.
అలాగే రాష్ట్రంలోని అన్ని ఎల్ఈడీ లైట్లను హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేయాలని సీఎం ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 5.50 లక్షల ఎల్ఈడీ లైట్లు ఉన్నాయని, అవుటర్ రింగ్ రోడ్ లోపల కోర్ అర్బన్ సిటీని కలిపితే మొత్తం 7.50 లక్షల లైట్లు అవసరమవుతాయని మున్సిపల్ శాఖ నివేదికలో వెల్లడించింది.
కొత్త ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు, నిర్వహణ కోసం పేరొందిన కంపెనీలను ఆహ్వానించి, ఏడేండ్లపాటు నిర్వహణ బాధ్యతలను అప్పగించేలా టెండర్ నిబంధనలను రూపొందించాలని సీఎం సూచించారు. లైట్లతో పాటు కంట్రోల్ బాక్స్‌లు ఏర్పాటు చేసి, వాటి పనితీరును నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఉండాలని తెలిపారు.
ఈ క్రమంలో హైదరాబాద్ ఐఐటీ లాంటి సంస్థలతో థర్డ్ పార్టీ ఆడిట్ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో వీధి దీపాలకు ప్రతి నెల రూ.8 కోట్ల విద్యుత్ బిల్లు అవుతున్నందున, సోలార్ పవర్ వినియోగంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖలు, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
