అల్ఫోర్స్ విద్యా సంస్థల్లో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

కరీంనగర్ : వావిలాలపల్లి గ్రామంలోని అల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్ నెక్స్ట్ మైదానంలో మంగళవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఫోటోగ్రఫీ ఒక గొప్ప వృత్తి అని, దీనివల్ల సమాజంలో చైతన్యం కల్పించడమే కాకుండా జ్ఞాపకాలను సజీవంగా నిలుపుకుంటామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఫోటోగ్రఫీకి ఉన్న ప్రత్యేక గుర్తింపును గుర్తుచేస్తూ, ఇది జీవన శైలిని మెరుగుపరచడంలో కీలకంగా సహకరిస్తుందని వివరించారు.
ఫోటోగ్రఫీ వల్ల సమాజానికి, ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగానికి విస్తృతమైన అవగాహన కల్పించబడుతుందని, సమస్యల పరిష్కారంలో ఫోటోగ్రాఫర్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా స్థానికంగా పత్రికా రంగంలో విశేష సేవలందిస్తున్న ఫోటోగ్రాఫర్లు ఎండి సుకుర్, ఏ. బాలకిషన్ రావు, గుంటపల్లి స్వామి, జనార్దన్, మోసీం, శ్రీధర్, జి. కిరణ్, రంజిత్, యు. దామోదర్ లను సన్మానించారు.
అదేవిధంగా పత్రికా రంగానికి ఎల్లప్పుడూ చేయూతనిస్తున్న నరేందర్ రెడ్డిని పలువురు ఫోటోగ్రాఫర్లు సత్కరించారు. కార్యక్రమంలో విద్యా సంస్థల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
