
ఎంజీఎంలో బ్రతికిన వాడిని మృతుడని చెప్పిన సంఘటనలో బిగ్ ట్విస్ట్
వరంగల్, జులై 12(zindagi9news – రవీందర్): వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. బ్రతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో ఆసుపత్రి సిబ్బంది తప్పుడు సమాచారం ఇచ్చిన కారణంగా గందరగోళం నెలకొంది.
నిన్న ఓ గుర్తుతెలియని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించిన అధికారులు, అది కుమారస్వామి మృతదేహమని చెప్పారు. అయితే ఆశ్చర్యకరంగా కుమారస్వామి ఇప్పటికీ ఎంజీఎంలోనే చికిత్స పొందుతున్నట్టు తేలింది. దీంతో కుటుంబసభ్యులు, పోలీసులు షాక్కు గురయ్యారు.
ఈ తప్పిదానికి కారణమైన ఆసుపత్రి సిబ్బంది చర్యపై స్పందన వ్యక్తమవుతోంది. పేషెంట్ బ్రతికి ఉన్నాడా, మరణించాడా అన్న విషయాన్ని నిర్ధారించుకోకుండానే తప్పుడు సమాచారం ఇచ్చిన సిబ్బంది చర్యలపై గట్టి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటనపై అధికారుల నుంచి స్పష్టత రాకపోయినా, ఎంజీఎం ఆసుపత్రిలో జరుగుతున్న విధానాలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
