
సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ : జాతీయ పెట్టుబడులు మరియు తయారీ మండలానికి (National Investment and Manufacturing Zone – NIMZ) సంబంధించి భూసేకరణ ప్రక్రియలో లంచం తీసుకుంటూ ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు అవినీతి నిరోధక శాఖ (అనిశా/ACB) అధికారులకు అడ్డంగా దొరికారు.
వివరాల్లోకి వెళితే, భూసేకరణలో భాగంగా ఫిర్యాదుదారుని భూదస్తావేజును ప్రాసెస్ చేసి రూ.52,87,500/- రూపాయల చెక్కును విడుదల చేయడంలో సహకరించినందుకు అధికారులు అతనినుంచి మొదటగా రూ.50,000/- లంచం డిమాండ్ చేశారు. అనంతరం, రూ.15,000/- లంచం తీసుకుంటున్న సమయంలో అనిశా అధికారులు రెడ్ చేసి పట్టుకున్నారు.
ఈ వ్యవహారంలో జహీరాబాద్‌కు చెందిన ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రాజా రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ సతీష్, డ్రైవర్ దుర్గయ్యలపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
ఈ ఘటనతో ప్రభుత్వ భూసేకరణ ప్రక్రియలో అవినీతికి పాల్పడుతున్న అధికారులపై నిందలు తలెత్తుతున్నాయి. బాధితులు న్యాయం కోరుతున్నారు.
