
జూలూరుపాడు, జూన్ 27 (జిందగీ 9 న్యూస్ రిపోర్టర్: రాము నాయక్) : జూలూరుపాడు లో విషాద ఘటన… జూలూరుపాడు మండలంలోని అన్నారుపాడు గ్రామానికి చెందిన భానోతు భద్రం (28), తన కుమారుడి భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనకు గురై శుక్రవారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పూర్తి వివరాల ప్రకారం, భద్రం కు పది సంవత్సరాల క్రితం వెంగన్నపాలెం గ్రామానికి చెందిన ప్రియాంకతో వివాహం జరిగింది. ఈ దంపతులకు విక్షిత్ అనే మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే ఆరు నెలల క్రితం ప్రియాంక అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుండి ఒంటరితనంతో బాధపడుతున్న భద్రం, తన కుమారుడిని చూసుకునే నిమిత్తం బేతాళపాడు గ్రామానికి చెందిన పద్మను రెండవ వివాహంగా చేసుకున్నాడు.
అయితే భద్రం కుమారుడు విక్షిత్ను మొదటి భార్య తరపు బంధువులు మరియు రెండవ భార్య సరైన విధంగా చూసుకోవడం లేదని అనుమానంతో, కుమారుడి భవిష్యత్తుపై ఆందోళనకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో రాచబండ్ల కోయగూడెం గ్రామ శివారులోని తన వ్యవసాయ భూమిలో నెమలికొయ్య చెట్టుకు తాడుతో ఉరివేసుకుని భద్రం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ ఘటనపై స్పందించిన మృతుడి తండ్రి బానోతు బద్య తన కుమారుడు కుమారుడి భవిష్యత్తును తట్టుకోలేకే మనస్థాపంతో ఉరివేసుకున్నాడని, తన కుమారుడి మృతిపై ఎలాంటి అనుమానం లేదని జూలూరుపాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ మేరకు ఏ.ఎస్.ఐ కోటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
