
జమ్మికుంటలో ఆకస్మిక తనిఖీ చేసిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం
జమ్మికుంట : కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఐపీఎస్ సోమవారం జమ్మికుంట పట్టణాన్ని ఆకస్మికంగా సందర్శించారు. తన పర్యటనలో భాగంగా మొదట జమ్మికుంట పట్టణ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించి, అక్కడి పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. స్టేషన్లో జరుగుతున్న కార్యకలాపాలను సమీక్షించిన ఆయన, నేర నివారణ, శాంతి భద్రతల పరిరక్షణ చర్యలపై అధికారులతో చర్చించారు.
అనంతరం కమిషనర్ గౌస్ ఆలం, పట్టణంలోని ప్రధాన ప్రాంతాలు అయిన రైల్వే స్టేషన్, గాంధీ చౌరస్తాలను సందర్శించి, అక్కడి భద్రతా పరిస్థితులను పరిశీలించారు. ప్రజల రాకపోకల ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ, నిఘా వ్యవస్థలపై వివరాలు తెలుసుకున్నారు. నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో పోలీస్ కమిషనర్‌తో పాటు జమ్మికుంట ఇన్స్పెక్టర్ ఎస్. రామకృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు.
