హైదరాబాద్, ఏప్రిల్ 29: మిస్ వరల్డ్-2025 పోటీకి తెలంగాణ ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేపడుతోంది. మే 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్న 72వ మిస్ వరల్డ్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, పోటీ సందర్భంగా హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటము పై ప్రతిష్టాత్మకంగా నిలిపేలా అన్ని విభాగాలూ సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొననున్న అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అతిథుల రాకపోకల కోసం ఎయిర్పోర్టు, హోటళ్లు, ఈవెంట్ వేదికల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టంగా చేపట్టాలని పోలీసు శాఖను సీఎం ఆదేశించారు. అంతేగాక, విదేశీ అతిథులకు తెలంగాణ సంస్కృతి, చారిత్రక ప్రదేశాలను పరిచయం చేసేందుకు ప్రత్యేక పర్యాటక పథకాలు రూపొందించాలని అధికారులకు సూచించారు.
నగరంలో పెండింగ్లో ఉన్న బ్యూటిఫికేషన్ పనులను తక్షణమే పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. కార్యక్రమానికి సంబంధించి అన్ని విభాగాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించి, సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. మిస్ వరల్డ్ నిర్వహణ సమయంలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని, పూర్తి స్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
