మల్కాపురం, విశాఖపట్నం: జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటనపై దేశం మొత్తం దిగ్బ్రాంతి చెందుతోంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంత విలేకరులు, అమరులకు కొవ్వొత్తుల ర్యాలీ ద్వారా నివాళులు అర్పించారు.
మంగళవారం సాయంత్రం, శ్రీహరిపురం ప్రధాన కూడలి నుంచి మల్కాపురం వరకు నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో పారిశ్రామిక ప్రాంత విలేకరుల సంఘం అధ్యక్షుడు ముప్పిడి గిరి నేతృత్వం వహించారు.
“పాకిస్తాన్ డౌన్ డౌన్”, “భారత్ మాతాకీ జై” వంటి నినాదాలతో ప్రాంతం మార్మోగింది.
ఈ సందర్భంగా గిరి మాట్లాడుతూ,
“పర్యాటకులపై జరిగిన ఈ దాడి మానవతా విరుద్ధం. ఉగ్రవాదాన్ని దేశం మొత్తం కలసి ఎదుర్కొనాల్సిన అవసరం ఉంది. అమరుల కుటుంబాలకు మనం అండగా నిలవాలి.” అని అన్నారు.
పి.పి.వి.ఎస్ విలేకరులు కూడా పాల్గొని, అమరుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు.
పహల్గాం దాడిలో ఇప్పటివరకు 26 మంది పర్యాటకులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ దాడికి పాకిస్తాన్ మద్దతుతో ఉన్న ముష్కరులే కారణమని వెల్లడైంది.
ఈ తరహా సంఘటనలకు నిరసనగా విశాఖలో జరిపిన విలేకరుల ఈ కార్యక్రమం దేశభక్తి, మానవతా విలువలకు నిదర్శనంగా నిలిచింది.
