వైరా– ప్రతినిధి, ఏప్రిల్ 23: బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ బుధవారం వైరా నియోజకవర్గంలో విస్తృత పర్యటన నిర్వహించారు. ఈనెల 27వ తేదీన వరంగల్లో జరగనున్న రాష్ట్ర స్థాయి బహిరంగ సభ విజయవంతం కావడమే లక్ష్యంగా, కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహించారు.
వైరా పట్టణంతో పాటు జూలూరుపాడు, ఏన్కూరు మండలాల్లో జరిగిన ఈ సమావేశాల్లో మదన్ లాల్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ, “వరంగల్ సభ తెలంగాణ రాజకీయాల్లో కీలక ఘట్టంగా నిలవనుంది. ఈ సభ ద్వారా బీఆర్ఎస్ బలాన్ని దేశం మొత్తం చూసే విధంగా నిర్వహించాలి,” అన్నారు.
సభ విజయవంతానికి బస్సుల ఏర్పాట్లు, ప్రచార సామాగ్రి పంపిణీ, కార్యకర్తల రవాణా వంటి అంశాల్లో ప్రత్యేక సమన్వయం అవసరమని సూచించారు. ప్రతి కార్యకర్త తన స్థాయిలో బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
సమావేశాలకు మండల, గ్రామ స్థాయి నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యకర్తల్లో విశేష ఉత్సాహం నెలకొంది.
ఈ సందర్భంగా మదన్ లాల్, నియోజకవర్గంలోని పలువురు శ్రేయోభిలాషుల ఇంట్లో జరిగిన శుభకార్యాలకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. “ప్రజల సంతోషాల్లో పాల్గొనడం ఓ ప్రజాప్రతినిధిగా నా బాధ్యత,” అని పేర్కొన్నారు.
ఈ పర్యటనతో వైరా నియోజకవర్గంలో రాజకీయ ఉత్సాహం మళ్లీ ఊపందుకుంది. కార్యకర్తలు ఒకతాటిపైకి వచ్చి, బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నారని విశ్వసనీయ సమాచారం.
