కరీంనగర్, ఏప్రిల్ 23: పహాల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో మృతి చెందిన అమాయకులకు నివాళులర్పిస్తూ, అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి శాంతి, సామరస్యానికి ప్రతి ఒక్కరూ తోడ్పాటునివ్వాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ భగత్‌నగర్‌లోని అల్ఫోర్స్ బాలికల జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన సంతాప కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డా. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, “ఉగ్రవాద దాడి పిరికిదనానికి నిదర్శనం. అమాయకుల ప్రాణాలను బలిగొనడం అత్యంత దుర్మార్గమైన చర్య. అభివృద్ధి మార్గంలో ముందుకెళ్తున్న దేశానికి ఇటువంటి ఘటనలు అడ్డుగోలు వేస్తున్నాయి. దేశ భద్రత కోసం ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా యువత, ఈ విధమైన చర్యలను తీవ్రంగా వ్యతిరేకించాలి,” అన్నారు.
అలాగే, సైనికులకు బాసటగా ఉండే విధంగా సమాజం ముందుకు రావాలనీ, జాతీయ స్థాయిలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ మరింత బలపడాలని అభిప్రాయపడ్డారు. “భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాతీయ భద్రతా వ్యవస్థ మరింత కఠిన చర్యలు తీసుకోవాలి. దేశ రక్షణకు మేము కూడా సిద్ధమే,” అని తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో దేశభక్తి ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో భాగంగా మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. అలాగే మృతుల కుటుంబాలకు తన సంస్థ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చివరగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
