పెబ్బేరు, Zindagi9News:పెబ్బేరు మండల పరిధిలో అనుమతి లేకుండా నడుస్తున్న జీరో చిట్టీలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై యుగంధర్ రెడ్డి హెచ్చరించారు. గురువారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా అనుమతి లేకుండా పెద్ద ఎత్తున చిట్టీల దందా జరుగుతోందని, అమాయక ప్రజలు వారి కష్టార్జిత డబ్బును ఈ దందాల్లో పెట్టి మోసపోతున్నారని తెలిపారు.చిట్టీ కాల పరిమితి ముగిసినా డబ్బులు చెల్లించక, ప్రజలను ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని, కొందరు తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారని చెప్పారు. కూరగాయలు, పాన్ షాపులు, టీ కొట్టు, టిఫిన్ సెంటర్లు వంటి చిన్నచిన్న వ్యాపారులు లక్షల్లో చిట్టీలు నడుపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.చట్టబద్ధమైన అనుమతి లేకుండా చిట్టీలు నడపడం నేరమని, ఈ తరహా అక్రమ కార్యకలాపాల్లో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ప్రజలు తమ ఆర్థిక అవసరాలను ఆసరా చేసుకొని అధిక వడ్డీ ఆశ చూపే వ్యక్తుల మాటలు నమ్మవద్దని, ఎవరైనా చిట్టీ మోసాలకు గురైతే వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.అంతేగాక, సైబర్ నేరాలు, దొంగతనాలు, హత్యాచారాలు, గంజాయి, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా వంటి అసాంఘిక కార్యకలాపాలను పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. “ప్రజల సహకారంతో పెబ్బేరు మండలాన్ని నేరరహిత మండలంగా తీర్చిదిద్దగలం” అని ఎస్సై యుగంధర్ రెడ్డి అన్నారు.
