“ఓటమి భయం సీఎం రేవంత్ రెడ్డిని చుట్టుముడుతోంది” – బండి సంజయ్
హైదరాబాద్, 24 ఫిబ్రవరి 2025:
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి ఖాయమనే భయంతోనే సీఎం ఒకేరోజు మూడు జిల్లాల్లో ప్రచారం నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది” అంటూ ఎద్దేవా చేశారు.
“సర్వేలు స్పష్టంగా బీజేపీ విజయం తథ్యమని చెబుతున్నాయి. కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోతోంది” అని ఆయన పేర్కొన్నారు.
“ఎమ్మెల్సీ ఎన్నికలకు ముఖ్యమంత్రి ఎందుకు వచ్చారు?”
“గెలిచినా, ఓడినా ప్రభుత్వానికి ఢోకా లేదంటున్న రేవంత్ రెడ్డి, ఎన్నికల ప్రచారానికి ఎందుకు వచ్చారు?” అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా ప్రచారం చేసిన దాఖలాలు లేవు అని గుర్తుచేశారు.
“ఫోన్ ట్యాపింగ్, స్కాంలపై సీబీఐ విచారణ జరిపే దమ్ముందా?”
“ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేస్, గొర్రెల స్కాం, కాళేశ్వరం ప్రాజెక్టు, డ్రగ్స్ వ్యవహారంపై నిజంగా నిజాయితీ ఉంటే సీబీఐ విచారణ కోరండి” అని సవాల్ విసిరారు.
“కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతల స్కాంలన్నీ రాష్ట్రంలోనే జరిగాయి. దోచుకున్నది తెలంగాణ ప్రజల సొమ్మే. కానీ, రేవంత్ రెడ్డి వాటిపై విచారణ చేయకుండా బీఆర్ఎస్తో చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నారు” అని ఆరోపించారు.
“బీసీలకు అన్యాయం చేస్తున్న సీఎం”
బీసీ రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తప్పుబడుతూ, “51% ఉన్న బీసీలను 46%కి తగ్గించి బుకాయిస్తున్నారా?” అని ప్రశ్నించారు.
“బీసీ జాబితాలో 80% ముస్లింలను చేర్చి నిజమైన బీసీలకు అన్యాయం చేస్తున్నారు. నిజమైన బీసీల భవిష్యత్తును కాపాడాలి అంటే, బీసీ జాబితా నుంచి ముస్లింలను తొలగించాలి. బీసీ బిల్లు పంపితే, కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత మేం తీసుకుంటాం” అని స్పష్టం చేశారు.
“కాంగ్రెస్ అబద్దాల ప్రచారం చేస్తోంది”
“ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగమంతా అర్ధసత్యాలు, అబద్దాలతో నిండిపోయింది” అని విమర్శించారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ డబ్బు, అధికారబలంతో ఎన్నికల్లో గెలవాలని చూస్తోంది అని ఆరోపించారు.
“ఈ ఎన్నికల్లో పట్టభద్రులు బీజేపీకి సమర్థంగా మద్దతు తెలపడం ఖాయం” అని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.
