టేకుమట్ల, జనవరి 28: టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామం జెడ్పిహెచ్ఎస్ హైస్కూల్లో గత నెల డిసెంబర్ 29 న 1987- 88 సంవత్సరానికి చెందిన 10వ తరగతి బ్యాచ్ దాదాపు 40 సంవత్సరాల తర్వాత కలుసుకున్న వీరు ఎంతో ఉత్సాహంతో పట్టరాని సంతోషంతో పరవశించిపోయారు. ఆనాటి పాత జ్ఞాపకాలు నెమరుసుకొని ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా రోజంతా ఆనందంగా గడిపి ఆ చిన్ననాటి తీపి గుర్తులను, చిలిపి చేష్టలను, ఆటలను, పాటలను వెలకట్టలేని ఆ మధురస్మృతులను, ఒకరికొకరు గుర్తు చేసుకున్నారు.అనంతరం జరిగిన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా మాట్లాడుతూ మనకు విద్యాబుద్ధులను అందించిన ఈ స్కూలుకు మనల్ని ఎంతో ఉన్నత స్థాయిలో నిలబెట్టిన బడికి ఏదో విధంగా శాశ్వత సహాయం చేసి ఈ బడి రుణం కొంతైనా తీర్చుకోవాలని ఏకగ్రీవంగా అందరూ నిర్ణయించారు.
అనుకున్నది తడువుగా నెల రోజుల లోపే దాదాపు 40 వేల రూపాయలు ఖర్చు చేసి పిల్లలు దాహార్తిని తీర్చేందుకు మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటుచేసి ఆ బ్యాచ్ సభ్యులు అయినటువంటి రమాదేవి, రవీంద్రచారి లు స్వయంగా విచ్చేసి అందరి సమక్షంలో ఈ ప్యూరిఫైయర్ మిషన్ ప్రారంభించారు. ఇంత గొప్ప సాహసం చేసి పిల్లల దాహార్తిని తీర్చినందుకు ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ రెడ్డి , ఎక్స్ ఎంపిటిసి ఏనుగు తిరుమల లచ్చిరెడ్డి , ఎక్స్ ఉప సర్పంచ్ పుప్పాల రాజు, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు
దాసారపు సదానందం,ఆ పూర్వ విద్యార్థులకు పేరుపేరునా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మరికొన్ని బ్యాచిలు ముందుకు వచ్చి మనం చదివిన బడికి ఆర్థిక సహాయం చేస్తూ చేయూతనందించాలని మనస్ఫూర్తిగా కోరుతూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం ప్రభాకర్ రెడ్డి ఉపాధ్యాయులు మల్లయ్య, గంపల స్వామి, రామ్ చందర్, దేవేందర్ పూర్వ విద్యార్థులు రవీంద్ర చారి, నేరెళ్ల తిరుపతి, నిడిగొండ వెంకట్ స్వామి,పెరకారి రమాదేవి, తదితరులు హాజరై విజయవంతం చేశారు.
