మణుగూరు నేతాజీ గ్రౌండ్ హత్య కేసు ఛేదించిన పోలీసులు.. 23 మంది అరెస్ట్
9 బైక్‌లు, 20 సెల్ఫోన్లు, కర్ర, చేతి కడియం స్వాధీనం
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే గ్యాంగ్‌లపై కఠిన చర్యలు: డీఎస్పీ రవీందర్‌రెడ్డి

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 31: మణుగూరు నేతాజీ గ్రౌండ్లో ఈ నెల 27న జరిగిన సింహాద్రి శివకుమార్ అలియాస్ శివ (28) హత్య కేసును మణుగూరు పోలీసులు ఛేదించారు. కేసులో మొత్తం 27 మంది నిందితులను గుర్తించగా.. వారిలో 23 మందిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉండగా, వారి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.
మణుగూరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. మణుగూరు గాంధీబొమ్మ సెంటర్‌కు చెందిన సింహాద్రి శివకుమార్ గత నాలుగేళ్లుగా హైదరాబాద్‌లో ఇంటీరియర్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. అతడి వద్ద పనిచేసే సతీష్‌కు, మణుగూరుకు చెందిన ఈర్ల లోకేష్‌కు గతంలో వివాదం జరిగింది. ఆ సమయంలో శివ జోక్యం చేసుకుని గొడవను అడ్డుకున్నట్లు దర్యాప్తులో తేలింది.
ఈ పాత వివాదాన్ని మనసులో పెట్టుకున్న లోకేష్.. ఈ విషయాన్ని ఎంకే (మణుగూరు ఖంధన్) గ్యాంగ్‌కు చెందిన జెట్పట్ రమ్యాకాంత్ అలియాస్ రమ్మీ అలియాస్ జెట్టి దృష్టికి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం జెట్టి, శివను ఫోన్లో బెదిరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. శివ మణుగూరుకు వస్తే హత్య చేస్తామని బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
నేతాజీ గ్రౌండ్‌కు పిలిచి దాడి
ఆగస్టు 27న రాఖీ పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి మణుగూరుకు వచ్చిన శివ.. తన స్నేహితుడు ఉదయ్‌కుమార్‌తో కలిసి బైక్‌పై నేతాజీ గ్రౌండ్‌కు వెళ్లాడు. అప్పటికే అక్కడ కాపు కాసి ఉన్న నిందితులు శివపై మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా కొట్టినట్లు పోలీసులు తెలిపారు.
శివతో పాటు వచ్చిన ఉదయ్‌కుమార్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా అతడిపైనా దాడి చేసినట్లు వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన శివను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
మృతుడి తండ్రి సింహాద్రి అప్పారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మణుగూరు పోలీస్ స్టేషన్లో Cr.No.309/2026గా కేసు నమోదు చేశారు. BNS సెక్షన్లు 189(2), 103(2), 109(1), 351(3), 61(2) రెడ్‌విత్ 190 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రేగులగండి అటవీ ప్రాంతంలో అరెస్ట్‌లు
విశ్వసనీయ సమాచారం ఆధారంగా మణుగూరు పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఆగస్టు 31 ఉదయం సుమారు 8 గంటలకు రేగులగండి అటవీ ప్రాంతంలో దాడి చేశారు. అక్కడ 23 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
వారి నుంచి:
- 9 బైక్‌లు
- 20 సెల్ఫోన్లు
- ఒక కర్ర
- ఒక చేతి కడియం
స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
‘ఎంకే గ్యాంగ్’పై పోలీసుల దర్యాప్తు
దర్యాప్తులో జెట్పట్ రమ్యాకాంత్ అలియాస్ రమ్మీ అలియాస్ జెట్టి కొంతకాలంగా ‘ఎంకే – మణుగూరు ఖంధన్’ పేరుతో ఓ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసి పలువురు యువకులను సభ్యులుగా చేర్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
గ్యాంగ్ సభ్యులు పరస్పరం సమాచార మార్పిడికి ‘టీం ఎంకే’ పేరుతో వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్ ఖాతా నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. గ్యాంగ్ సభ్యులు కలిసి తిరగడం, మద్యం సేవించడం, గొడవలకు దిగడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
అయితే అరెస్ట్ చేసిన నిందితులకు గంజాయి సేవించడం, విక్రయించడం లేదా గంజాయి వ్యాపారంతో సంబంధం ఉన్నట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు స్పష్టం చేశారు.
గతంలోనూ కేసులు
అరెస్ట్ చేసిన వారిలో కొందరిపై గతంలోనే కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. జెట్పట్ రమ్యాకాంత్, గుగులోత్ రమేష్ తదితరులపై పేకాటకు సంబంధించిన కేసులు ఉండగా, కొందరిపై కొట్లాట కేసులు నమోదైనట్లు డీఎస్పీ వెల్లడించారు. గనిబోయిన సాత్విక్‌పై డెకాయిటీ కేసు కూడా నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
మరో నలుగురి కోసం గాలింపు
ఈ కేసులో మొత్తం 27 మంది నిందితులను గుర్తించగా 23 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
మణుగూరు పరిధిలో ఎవరైనా ఏ పేరుతోనైనా గ్యాంగులు ఏర్పాటు చేసి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ, అల్లర్లు సృష్టిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని డీఎస్పీ రవీందర్‌రెడ్డి హెచ్చరించారు.
ఇలాంటి గ్యాంగులు, అసాంఘిక గ్రూపులకు సంబంధించిన సమాచారం ప్రజల దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. యువత చెడు స్నేహాలకు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తుపై దృష్టి సారించాలని పోలీసులు సూచించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
