ఒక ఈవెంట్లో నిర్మాత అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దిల్ రాజును స్టేజ్‌పై ఆహ్వానించే సందర్భంలో, ఆయన మాట్లాడుతూ, “వారం రోజుల్లోనే కష్టాలు, నష్టాలు, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ అనుభవించారు” అని అన్నారు. ఈ వ్యాఖ్యలను కొంతమంది రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాను తక్కువ చేసి మాట్లాడినట్లుగా భావించారు. దీంతో, మెగా అభిమానులు అల్లు అరవింద్‌పై ట్రోలింగ్ ప్రారంభించారు.
ఈ పరిణామాలపై అల్లు అరవింద్ స్పందిస్తూ, రామ్ చరణ్ తనకు కొడుకులాంటి వాడని, తన ఏకైక మేనల్లుడు అని తెలిపారు. అలాగే, ఆ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేయలేదని, దిల్ రాజు జీవితంలోని అనుభవాలను చెప్పే క్రమంలో అనుకోకుండా ఆ మాటలు వచ్చాయని వివరణ ఇచ్చారు. అదే సమయంలో, ఆ మాటలు అనాల్సింది కాదని, అభిమానులు బాధపడితే క్షమించాలన్నారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ, “చరణ్ నా కొడుకులాంటివాడు. నాకున్న ఏకైక మేనల్లుడు. మా ఇద్దరి మధ్య అద్భుతమైన అనుబంధం ఉంది. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి” అని అన్నారు.
ఈ వివరణతో, అల్లు అరవింద్ తన వ్యాఖ్యలపై స్పష్టతనిచ్చారు.
