డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లను ప్రభుత్వం ద్వారా ఆర్టీవో ఆఫీసుల నుండే జారీ చేయాలి.
ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్ పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ (AIRTWF) డిమాండు
డ్రైవింగ్ లైసెన్సులు వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లను ప్రభుత్వం ద్వారా ఆర్టీవో ఆఫీస్ ల నుండే జారీ చేయాలని,రవాణా రంగ ప్రైవేటీకరణను ఆపాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు డోన్ మోటార్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి టి.శివరాం డిమాండ్ చేశారు.రవాణా రంగ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం స్థానిక ఆర్టీవో కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించారు.అనంతరం మోటార్ వెహికల్ ఇన్స్ స్పెక్టర్ టి.క్రాంతి కుమార్ కి వినతి పత్రం అందజేశారు.ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు యు.శ్రీనివాసులు,ప్రైవేట్ స్కూల్ బస్సు వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.మద్దిలేటి,మినీ లారీ ఓనర్ రాజు,ఆర్టీసీ హయర్ బస్సు యూనియన్ సుబ్బరాయుడు,మెకానిక్ యూనియన్ అధ్యక్షులు ఎస్.కె.హుస్సేన్ హాజరు అయ్యారు.
అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రంగాలను ప్రైవేటుపరం చేయాలనే నిర్ణయంలో భాగంగా ట్రాన్స్ పోర్టు రంగానికి గుండెకాయగా ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూరుస్తూ ప్రజల భద్రత రీత్యా డ్రైవింగ్ లైసెన్సులు వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లను జారీ చేసే వ్యవస్థను 2025 జనవరి నుంచి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సన్నాహాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.ప్రజల భద్రత కాపాడే సందర్భంలో రవాణా శాఖ అనేక కొలమానాలతో డ్రైవింగ్ లైసెన్స్ గురించి ఎడ్యుకేట్ చేసి ఇచ్చే విధానాన్ని తుంగలో తొక్కి ప్రైవేటు సంస్థలకు ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ (ఎటిఎస్) విధానం ద్వారా అనుమతి ఇచ్చే నిర్ణయం దుర్మార్గం అన్నారు.ఇప్పటికే ఏటీఎస్ కేంద్రాలను గుజరాత్,బీహార్,రాజస్థాన్,కేరళ,కర్ణాటక,తెలంగాణ రాష్ట్రాలు సొంతంగా ఏర్పాటు చేసుకున్నాయని ఇక్కడ మాత్రం ప్రైవేటు వైపు అడుగులు వేయడమంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని ఇది ప్రభుత్వానికి సిగ్గుచేటని ఎద్దేవా చేశారు.ప్రజల భద్రతకు ప్రాణాలకు సంబంధం కలిగి ఉన్న విధానాన్ని డబ్బే కొలమానంగా బాధ్యతా రహితంగా ఉండే ప్రైవేటు సంస్థలకు అవకాశాన్ని కల్పించడం అంటే ప్రజల ప్రాణాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నదో
తెలుస్తున్నదని అదే విధంగా ఆర్టీవో ఆఫీసుల నిర్వహణలో ప్రభుత్వానికి ఆదాయ వనరుగా ఉన్న వీటిని ఆర్టీవో ఆఫీస్ ల నుండి తొలగిస్తే ఆర్టీవో ఆఫీస్ లు నష్టాల్లోకి వెళ్తాయని తద్వారా ప్రజల పైన టాక్స్ ల రూపంలో భారాలు పడతాయని ప్రజల భద్రత ప్రైవేటు సంస్థల చేతిలో పడి ప్రశ్నార్థకం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 66 ఆర్టిఓ కార్యాలయాలలో సర్టిఫికెట్ల జారీ విధానం కొనసాగుతున్నదని దీనిని 26 జిల్లా కేంద్రాలకు మాత్రమే పరిమితం చేస్తే వాహనాల రద్దీ పెరిగి రోజుల తరబడి పనులు కాకపోగా దూరాభారాలతో ఇబ్బడి ముబ్బడిగా ఖర్చులు పెరిగి వాహనదారులు తీవ్రంగా నష్టపోతారని ఇప్పటికే సంక్షోభంలో ఉన్న రవాణా రంగం మరింత సంక్షోభంలోకి నెట్టబడి ఈ రంగంపై ప్రత్యక్షంగా,పరోక్షంగా ఆధారపడిన కోట్లాది కుటుంబాలు ఉపాధి అవకాశాలు కోల్పోయి రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు.కనుక ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని లేనియెడల ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు రామచంద్రుడు,తిరుపాలు,నూర్భాషా,మహేష్,శివరంగస్వామి,షేక్,వెంకటేశ్వర్లుగౌడ్,శ్రీరాములు,సుధాకర్, మహేష్,సూరన్న,సుబ్బరాయుడు లారీ,ఆటో,మినీ లారీ,ప్రైవేటు స్కూల్ బస్సు,ఆర్టీసీ హయర్ బస్సు,డ్రైవర్లు, ఓనర్లు,మెకానికులు, తదితరులు పాల్గొన్నారు.
