
రజక మహిళపై దాడి: కఠిన చర్యలు తీసుకోవాలని రజక సేవా సంఘం డిమాండ్
నంద్యాల/బాపట్ల: బాపట్ల జిల్లా నడింపల్లి గ్రామంలో రజక మహిళపై జరిగిన దాడి ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఒక మహిళపై కత్తితో దాడి చేసి గాయపరిచిన ఘటన అమానుషమని, అరాచకమని నంద్యాల జిల్లా రజక సేవా సంఘం ఖండించింది.
ఈ ఘటనపై స్పందించిన నంద్యాల జిల్లా రజక సేవా సంఘం అధ్యక్షుడు కొర్రపోలురు నాగరాజు మాట్లాడుతూ, దాడికి పాల్పడిన వ్యక్తిపై పోలీసులు తక్షణమే కఠిన చర్యలు తీసుకుని బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రజక కమ్యూనిటీకి ప్రభుత్వం జారీ చేసిన జీవోలు అమలులో ఉన్నాయా? లేక కేవలం పత్రాలకే పరిమితమైపోయాయా? అని ప్రశ్నించారు.
“మనిషి పుట్టుక నుంచి చావు వరకు ప్రతి కుటుంబానికి సేవ చేసే వర్గం రజకులది. అలాంటి వర్గాన్ని ఎందుకు చులకనగా చూస్తున్నారు? గ్రామ బహిష్కరణలు, దాడులు జరుగుతున్నా చూస్తూ ఊరుకోవాలా?” అని సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.
రజకులపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. పోలీసులు వెంటనే నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లా, ప్రతి తాలూకా స్థాయిలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించింది.
రజకుల గౌరవం, భద్రత కాపాడేందుకు ప్రభుత్వం స్పష్టమైన విధానాలు అమలు చేయాలని, ఇలాంటి ఘటనలు ఇకముందు జరగకుండా బాధ్యత వహించాలని నంద్యాల జిల్లా రజక సేవా సంఘం డిమాండ్ చేసింది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
