హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలైన సురానా డెవలపర్స్ మరియు సాయి సూర్య డెవలపర్స్పై ఇటీవల జరిగిన ఈడీ దాడుల్లో కీలక ఆధారాలు వెలుగుచూశాయి.
ఈ రెండు కంపెనీలకు మహేష్ బాబు వాణిజ్య ప్రకటనలు చేశారని, ఇందుకోసం ఆయన రూ. 5.9 కోట్లు పారితోషికంగా తీసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. అందులో రూ. 2.5 కోట్లు మనీ లాండరింగ్ ద్వారా అక్రమంగా చెల్లించబడినట్లు ఆధారాలు లభించినట్లు సమాచారం.
ప్రచారాల ప్రభావంతో అనేక మంది ప్రజలు రియల్ ఎస్టేట్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టారని, కానీ ఆ సంస్థలు అక్రమాలకు పాల్పడ్డాయని ఈడీ పేర్కొంది.
అక్రమాలకు నేరుగా సంబంధం లేకపోయినా, మనీ లాండరింగ్ ద్వారా డబ్బు స్వీకరించిన నేపథ్యంలో మహేష్ బాబుకు విచారణ నిమిత్తం ఏప్రిల్ 27న హాజరు కావాలని ఆదేశాలు జారీచేసింది.
ఈ వ్యవహారంపై మహేష్ బాబు లేదా ఆయన తరఫు నుంచి ఇప్పటి వరకు అధికారిక స్పందన రాలేదు.
