ప్రభుత్వం హామీ అమలు చేయాలి: జిల్లా సిపిఎం కార్యదర్శి మూషం రమేష్
బోయినిపల్లి (సిరిసిల్ల జిల్లా): మద్య మానేరు జలాశయానికి భూములు కోల్పోయిన నిర్వాసితులకు పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబానికి ₹5.04 లక్షలు వెంటనే అందజేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన కోరారు.
బోయినిపల్లి మండలంలోని నీలోజిపల్లి గ్రామంలో సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమానికి సిపిఎం మండల కార్యదర్శి గురుజాల శ్రీధర్ అధ్యక్షత వహించారు.
సంస్థలు ఎక్కడ? ప్రభుత్వ ఉద్దేశం ఏమిటి?
ఈ సందర్భంగా మాట్లాడుతూ, మద్య మానేరు ముంపు గ్రామాల ప్రజలకు ఉపాధి కల్పించే పరిశ్రమలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎన్నికల హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
“విదేశాల నుంచి వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తెచ్చామన్న ప్రభుత్వం, ఆ పరిశ్రమలను ముంపు బాధితుల కోసం ఎందుకు ఉపయోగించదు?” అని ప్రశ్నించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పరిశ్రమలు తీసుకురావడానికి ఎందుకు కృషి చేయడం లేదని నిలదీశారు.
నిర్వాసితుల త్యాగాన్ని ప్రభుత్వం గుర్తించాలి
మద్య మానేరు ప్రాజెక్ట్ కోసం తమ భూములు త్యాగం చేసిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఒక్క హైదరాబాద్ అభివృద్ధి చెందితేనే రాష్ట్రం ముందుకు పోతుందన్న దృష్టికోణాన్ని మార్చుకోవాలని సూచించారు.
“భూములు కోల్పోయిన రైతులకు కనీసం కోటి రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలి. వారిచేసిన త్యాగం తక్కువదేమీ కాదు” అని పేర్కొన్నారు. ప్రభుత్వం హామీలను నెరవేర్చకపోతే, సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎర్ర నాగరాజు, సింగిరెడ్డి శంకర్, అనుముల రవి, ఆవుల మల్లయ్య, వెంకట్ రెడ్డి, లింబాద్రి, కడుదుల రవి తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
