తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా, సుప్రీంకోర్టు గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, డాక్టర్ సంజయ్ కుమార్, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డిలకు నోటీసులు పంపింది.
ఈ పిటిషన్లో, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరారు. సుప్రీంకోర్టు, కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావులపై ఉన్న అనర్హత పిటిషన్‌తో పాటు, ఈ కొత్త పిటిషన్‌ను కూడా ఫిబ్రవరి 10న విచారించనున్నట్లు తెలిపింది.
ఈ పరిణామాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు (కేటీఆర్) స్పందించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఖాయమని, తమ పార్టీ ఉపఎన్నికలకు సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ కేసులో తదుపరి విచారణ ఫిబ్రవరి 10న సుప్రీంకోర్టులో జరగనుంది.
