
టీబి రహిత గ్రామాలే లక్ష్యం – జమ్మికుంటలో టీబి ఛాంపియన్స్ శిక్షణా కార్యక్రమం
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా DM&HO, DTCO ఆదేశాల మేరకు క్షయ నివారణ విభాగం మరియు ఇంపాక్ట్ ఇండియా ప్రాజెక్ట్ – టీబి అలర్ట్ ఇండియా సహకారంతో వావిలాల, ఇల్లందకుంట, చల్లూరు PHC ల వైద్యుల ఆధ్వర్యంలో జమ్మికుంట వర్తక సంఘం భవనంలో టీబి ఛాంపియన్స్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హుజురాబాద్ Dy. DM&HO డాక్టర్ చందు, ఇల్లందకుంట PHC మెడికల్ ఆఫీసర్ డాక్టర్ తులసిదాస్, డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ మేనేజర్ సురేందర్, హెల్త్ ఎడ్యుకేటర్స్ పంజాల ప్రతాప్ గౌడ్, మోహనరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
డాక్టర్ చందు మాట్లాడుతూ – “క్షయ వ్యాధి బాధితులు తగిన జాగ్రత్తలు వహిస్తే ఇతరులకు వ్యాధి సంక్రమించదు. ప్రభుత్వం ఉచితంగా చికిత్స అందిస్తోంది. లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరీక్షలు చేయించుకోవాలి” అని సూచించారు.
డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ మేనేజర్ సురేందర్ మాట్లాడుతూ – “ప్రధాని లక్ష్యాల ప్రకారం 2025 నాటికి దేశాన్ని టీబి రహితంగా మార్చడం అందరి బాధ్యత. మంచి ఆహారం, అవగాహన, గ్రామస్థాయిలో ప్రజల సహకారం ద్వారా ఇది సాధ్యం” అన్నారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో క్షయ వ్యాధిని జయించిన వారిని ఎంపిక చేసి, వారికి అవగాహన శిక్షణ ఇస్తున్నామని, తరువాత వారు గ్రామాల్లో ప్రజల్లో అవగాహన కల్పించి, బాధితులకు ధైర్యం నింపే విధంగా పనిచేస్తారని అధికారులు తెలిపారు.
జిల్లా క్షయ నివారణ విభాగం, జనరల్ హెల్త్ సిబ్బంది, ఇంపాక్ట్ ఇండియా ప్రాజెక్ట్ సమన్వయంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, కరీంనగర్ జిల్లాను టీబి రహిత జిల్లాగా మార్చడం లక్ష్యమని ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ప్రభాకర్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో జమ్మికుంట సబ్ సెంటర్ MLHP డాక్టర్ మహోన్నత పటేల్, హెల్త్ ఎడ్యుకేటర్స్ ప్రతాప్ గౌడ్, మోహన్ రెడ్డి, TSTS దేవేందర్ రెడ్డి, ఇంపాక్ట్ ఇండియా సిబ్బంది గీతాంజలి, తిరుపతి, అలాగే ANM, ఆశావర్కర్లు పాల్గొన్నారు.
