కౌశిక్ రెడ్డిని బిఆర్ఎస్ నుంచి బహిష్కరించాలి..
అధిష్టానం కఠిన చర్యలు తీసుకోవాలి..
అధికారం కోల్పోయినా
అహంకారం తగ్గడం లేదు..
సభ్యత మరిచి తోటి ఎమ్మెల్యే పై
దాడి చేయడం హేయమైన చర్య..
మీడియాలో హైలెట్ కోసం ఓవరాక్షన్..
దూషణలకు దిగి కౌశిక్ భౌతిక దాడులు చేయడం ప్రజాస్వామ్యాన్నే అపహస్యం చేశారు..
కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావు
సభ్యత సంస్కారం మరిచి తోటి ఎమ్మెల్యే పైనే అధికారిక సమావేశంలో దూషణలకు దిగి భౌతికంగా దాడి చేసిన కాంట్రవర్సీ కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే సభ్యత్వాన్ని ప్రభుత్వం రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు విజ్ఞప్తి చేశారు. రోజురోజుకు శృతి మించుతున్న ఆగడాలను అరికట్టేందుకు బీఆర్ఎస్ అధిష్టానం కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సమాధానం ఇవ్వాలని సవాల్ విసిరారు. మీరంతా వెనుక ఉండి భౌతిక దాడులు చేయాలని ఉసిగొల్పుతున్నారా ? అని ప్రశ్నించారు. రౌడీయిజాన్ని గుండాయిజాన్ని బీఆర్ఎస్ పెంచి పోషిస్తున్నదా అని మండిపడ్డారు. గత పదేళ్ల కాలంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇలా దిగజారుడు రాజకీయాలు చేయలేదని పేర్కొన్నారు.
మంగళవారం వెలిచాల రాజేందర్రావు మీడియాతో మాట్లాడుతూ ఆదివారం నాడు కరీంనగర్ కలెక్టరేట్లో ముగ్గురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్న అధికారిక సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై కౌశిక్ రెడ్డి దూషణలకు దిగి దాడి చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ప్రజాస్వామ్యంలో సమస్యలపై ప్రశ్నించే హక్కు ఉంటుందని, వ్యక్తిగతంగా టార్గెట్ చేసి దాడి చేసి కౌశిక్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేశారని మండిపడ్డారు. అధికారం కోల్పోయినా బీఆర్ఎస్ నేతలకు అహంకారం తగ్గలేదని, కౌశిక్ రెడ్డి వ్యవహారంపై హుజురాబాద్ ప్రజలే ఛీకొడుతున్నారని పేర్కొన్నారు. ఆయన చర్యల వల్ల హుజురాబాద్ ప్రజలే బాధపడాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు.
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఏదో ఒకటి వివాదాస్పదం చేయడం . తర్వాత మీడియాలో హైలెట్ కోసం ఓవరాక్షన్ చేయడం అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. ఇలా అనేకసార్లు ఇదే విధంగా వ్యవహరించారని, మంత్రులు, కలెక్టర్లు అధికారులు అంటే లెక్క లేకుండా పోయిందని, నోటి దురుసు తనం ఎక్కువైందని మండిపడ్డారు.
చేసిన ఘనకార్యానికి పోలీసులు అరెస్టు చేస్తే మాత్రం బిఆర్ఎస్ నేతలు పెడ బొబ్బలు పెడుతున్నారని, కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరును మాత్రం ఎందుకు ఖండించడం లేదని, అసలు బీఆర్ఎస్ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పైన చేయి చేసిన వ్యక్తిని అరెస్టు చేస్తే మాట్లాడుతున్న బిఆర్ఎస్ నేతలు, కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరుపై ఎందుకు మందలించలేదని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుతో బీఆర్ఎస్కే తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఈయనను ఇక పార్టీలో ఉంచుకుంటే పార్టీ పరువు మొత్తం గంగలో కలుస్తుందని సూచించారు. కౌశిక్ రెడ్డి వ్యవహారంపై కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్ సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. అధిష్టానం వెంటనే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని రాజేందర్ రావ్ డిమాండ్ చేశారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
