
ఇందిరమ్మ ఇండ్ల లంచగొండులపై సస్పెన్షన్ – కమిటీ సభ్యుల తొలగింపు, క్రిమినల్ కేసులు
ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అవినీతికి పాల్పడితే ఎంతమందైనా ఉపేక్షించబోమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సమస్యలు, ఫిర్యాదులపై హౌసింగ్ కార్పొరేషన్లో ఏర్పాటు చేసిన కాల్‌సెంటర్‌కు వచ్చిన వివరాలపై శుక్రవారం రాష్ట్ర కార్యదర్శాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు.
మధిరాల మండలం పోలుమల్ల గ్రామానికి చెందిన కొండలింగయ్యకు ఇల్లు మంజూరుకై పది వేల రూపాయలు డిమాండ్ చేసిన ఇందిరమ్మ కమిటీ సభ్యుడు సత్తెయ్యను కమిటీ నుండి తొలగించి, క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే జనగాం జిల్లా దేవరుప్పల మండలం పడమటి తండాలో శివమ్మ అనే లబ్ధిదారురాలికి 30 వేల రూపాయలు డిమాండ్ చేసిన ఘటనపై 24 గంటల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని సూచించారు.
ఇండ్లు మంజూరుకాకుండానే లబ్ధిదారుల ఖాతాలో నిధులు జమ చేసిన ఖమ్మం, జగిత్యాల, కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన నలుగురు గ్రామ పంచాయతీ కార్యదర్శులను తక్షణమే సస్పెండ్ చేశారు. బ్యాంకులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయిన నిధులను పాతబాకీల కింద సర్దుబాటు చేసుకోవడం సహించబోమని, అలాంటి బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
లబ్ధిదారులు ఎదుర్కొంటున్న ఆధార్, బ్యాంక్ లింకింగ్ సమస్యలను ఈ నెల 25లోగా పరిష్కరించి, దసరా పండగలోపు చెల్లింపులు పూర్తిచేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో ఏఈలు లబ్ధిదారుల ఆధార్, బ్యాంక్ వివరాలు స్వయంగా పరిశీలించాలని ఆదేశించారు.
లబ్ధిదారులు పేదల నుండి లంచం డిమాండ్ చేస్తే, 24 గంటల్లోనే క్రిమినల్ కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఇందుకోసం లబ్ధిదారులు టోల్‌ఫ్రీ నంబర్ 1800-599-5991కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.
✍️ జిందగీ9న్యూస్
