
హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలను బీజేపీకి అప్పగిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తాం : కేంద్ర మంత్రి బండి సంజయ్
జమ్మికుంట / హుజూరాబాద్ :
హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలను బీజేపీకి అప్పగిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. జమ్మికుంట డిగ్రీ అండ్ పీజీ కాలేజీ ఆవరణలో సింథటిక్ స్టేడియం నిర్మాణానికి సంబంధించి స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో, ఆయా మున్సిపాలిటీల్లో బీజేపీ అధికారంలో లేకపోయినా కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు. జమ్మికుంట రైల్వే స్టేషన్ను అమృత్ పథకంలో చేర్చి కరీంనగర్ తరహాలో, ఎయిర్పోర్టు మాదిరిగా ఆధునీకరిస్తామని స్పష్టం చేశారు.
స్టేడియానికి రూ.6.5 కోట్లు
జమ్మికుంట డిగ్రీ అండ్ పీజీ కాలేజీ స్థలంలో సింథటిక్ స్టేడియం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.6.5 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. అవసరమైతే మరిన్ని నిధులు తీసుకొచ్చి స్టేడియం పూర్తి చేస్తామని, వెంటనే టెండర్ ప్రక్రియ ప్రారంభించి పనులు మొదలు పెడతామని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్, సిబ్బందితో సమావేశమై వారి సూచనలు స్వీకరించారు.
కాలేజీకి చెందిన కొంత భూమి కబ్జాకు గురైందన్న ఫిర్యాదులు వచ్చాయని, ప్రభుత్వ భూముల కబ్జాలకు తాను పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు. జమ్మికుంటలోనూ కబ్జాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కేంద్ర నిధులతోనే అభివృద్ధి
హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో బీజేపీ ఛైర్మన్లు లేరని, రాష్ట్రంలో అధికారంలో లేనప్పటికీ కేంద్ర మంత్రిగా నియోజకవర్గ అభివృద్ధికి పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నానని తెలిపారు. ఇటీవల జమ్మికుంటతోపాటు హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.3 కోట్ల విలువైన వైద్య పరికరాలు అందించామని చెప్పారు. కుల సంఘాలు, ఆలయాలు, పాఠశాలలకు కూడా నిధులు మంజూరు చేసినట్లు వివరించారు.
జమ్మికుంట పేరు మున్సిపాలిటీ అయినా అభివృద్ధి లేదని, వర్షాలు వస్తే మునిగిపోయే కాలనీలు ఎన్నో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధికి సహకరించే పరిస్థితి లేకపోవడంతో ప్రజలను ఆలోచించాలని కోరారు.
నాయిని చెరువు అభివృద్ధి, అద్దె కుటుంబాలకు భరోసా
జమ్మికుంట మున్సిపాలిటీని బీజేపీకి అప్పగిస్తే నాయిని చెరువును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. బోటింగ్, పార్క్ సదుపాయాలతో అహ్లాదకరంగా తీర్చిదిద్దుతామన్నారు.
అలాగే అద్దె కుటుంబాల్లో మరణాలు జరిగితే ఇళ్ల యజమానులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొంటూ, జిల్లా కలెక్టర్, ఆర్డీవోతో మాట్లాడి స్థలం కేటాయిస్తే ఎంపీ నిధులతో ప్రత్యేక భవన సముదాయాన్ని నిర్మించి బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు లేవని, ఇప్పటివరకు పైసా కూడా ఇవ్వలేదని విమర్శించారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేయగల శక్తి బీజేపీకే ఉందని ప్రజలు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి క్రిష్ణారెడ్డి, స్థానిక నేతలు ఆకుల రాజేందర్, రఘ తదితరులు పాల్గొన్నారు.
