
జమ్మికుంట, జూన్ 14 (జిందగీ9 న్యూస్ : దిడ్డి రామ్మూర్తి):జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ధర్మారం గ్రామంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఒంటరి మహిళ మారపల్లి పద్మకు చెందిన సుమారు లక్ష రూపాయల విలువ గల గేదె విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందింది. ఈ గేదె పాలతో వచ్చే ఆదాయమే పద్మకు జీవనాధారంగా నిలిచేది. గేదె మృతి పట్ల ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి గురై విలపించగా, ఈ దృశ్యం అందరినీ కలచివేసింది.
వివరాల్లోకి వెళ్తే, గ్రామంలో మంచినీటి పైప్‌లైన్ కోసం జేసీబీతో తవ్వకాలు జరిగాయి. ఈ క్రమంలో సెంట్రల్ లైటింగ్‌కు సంబంధించిన విద్యుత్ తీగలు భూమిలో నుంచి బయటికి వచ్చాయి. వాటిని నిర్లక్ష్యంగా అలాగే వదిలివేయడంతో, ఆ వైర్లను తాకిన గేదె క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయింది.
భర్త లేని పద్మ దైనిక జీవనాన్ని పాల అమ్మకంతో కొనసాగిస్తుండగా, ఈ ప్రమాదంతో ఆమె ఆశలన్నీ అడియాసలయ్యాయి. బాధితురాలిని వెంటనే ఆదుకోవాలని గ్రామస్థులు అధికారులు కోరుతున్నారు. బాధ్యత వహించాల్సిన శాఖలు స్పందించాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
