
మూడవదశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: సీపీ గౌష్ ఆలం
కరీంనగర్, డిసెంబర్ 16:
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డిసెంబర్ 17న జరగనున్న మూడవదశ గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. ఎన్నికల బందోబస్తుపై నిర్వహించిన సమీక్ష సమావేశం అనంతరం ఆయన వివరాలు వెల్లడించారు.
ఈ దశలో వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంట, హుజురాబాద్, వి. సైదాపూర్ మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయని, మొత్తం 111 గ్రామ పంచాయతీలు, 1034 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ప్రతి మండలానికి ఒక ఏసీపీని కేటాయించగా, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు అధికంగా ఉన్న చోట అదనపు ఏసీపీలను నియమించినట్లు చెప్పారు.
సున్నితమైన పోలింగ్ కేంద్రాల్లో అదనపు బలగాలతో పాటు వెబ్‌కాస్టింగ్ లేదా మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌కు స్టాటిక్ పోలీస్ పార్టీ, ప్రతి రూట్‌కు మొబైల్ పార్టీ ఉండేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. అలాగే ప్రతి మండలానికి ఏసీపీ స్థాయి అధికారిని ఇన్చార్జిగా నియమించి, వారి ఆధీనంలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌ను సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 100 మీటర్ల పరిధిలో ప్రచారం, పార్టీ చిహ్నాలు, గుంపుల గుమికూడింపులు నిషేధమని, పోలింగ్ స్టేషన్లో మొబైల్ ఫోన్లు, ప్రచార సామగ్రికి అనుమతి లేదని సీపీ స్పష్టం చేశారు.
భద్రత కోసం మొత్తం 877 మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఇందులో 6 ఏసీపీలు, 20 ఇన్స్పెక్టర్లు, 39 ఎస్సైలు, 40 ఏఎస్సైలు/హెడ్ కానిస్టేబుళ్లు, 460 కానిస్టేబుళ్లు, 35 స్పెషల్ యాక్షన్ టీమ్ పోలీసులు, 178 హోంగార్డులు, 100 మంది బెటాలియన్ స్పెషల్ పోలీసులు ఉన్నారని తెలిపారు. అదనంగా ఎన్సీసీ సభ్యులను కూడా వినియోగిస్తున్నట్లు చెప్పారు.
వైర్లెస్ కమ్యూనికేషన్ కోసం ఐదు మండలాల్లో అదనపు రిపీటర్లు, బేస్ సెట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్‌లను కట్టుదిట్టమైన భద్రతల మధ్య రిసీవింగ్ సెంటర్లకు తరలిస్తామని పేర్కొన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణ కోసం భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని, ఎన్నికల అనంతరం అదే రోజు విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని సీపీ స్పష్టం చేశారు. ప్రజలు, రాజకీయ పార్టీలు పోలీసు శాఖకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
