
బోయినిపల్లి, మే 14(zindagi9news):ప్రతి ఫిర్యాదుపై వేగంగా స్పందించి బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్ సూచించారు. బుధవారం రోజు ఆయన బోయినిపల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్లో అమలవుతున్న 5ఏస్ విధానాన్ని పరిశీలించి, విధుల్లో ఉన్న సిబ్బందితో పరస్పర చర్చ జరిపారు.
స్టేషన్ పరిధిలో నమోదవుతున్న కేసుల వివరాలు, పెండింగ్ ఫైళ్ళు, రికార్డ్ రూమ్, రైటర్ రూమ్ తదితర విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీ, ప్రజలతో మరింత సత్సంబంధాలు నెలకొల్పాలన్నారు. గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ మరింత బలోపేతం చేయాలని, తరచూ గ్రామాలను సందర్శించి నేరాలపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.
పాత నేరస్థులు, రౌడీషీటర్లపై నిరంతర నిఘా ఉంచాలని, నేరాలుకు దారితీసే ప్రాంతాలను గుర్తించి చర్యలు చేపట్టాలన్నారు. ప్రజల్లో, ముఖ్యంగా యువతలో సైబర్ నేరాలపై అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అలాగే, బ్లాక్ స్పాట్స్‌గా గుర్తించిన రోడ్డు ప్రమాద ప్రాంతాల్లో నివారణ చర్యలు తీసుకోవాలని, రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, వాహన తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీచేశారు.
ఈ కార్యక్రమంలో వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ అనిల్ కుమార్‌తో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
