
హైదరాబాద్: నగరంలో నకిలీ వస్తువుల విక్రయమే లక్ష్యంగా సాగుతున్న భారీ ముఠా గుట్టును హైదరాబాద్ సిటీ పోలీసులు రట్టు చేశారు. కమిషనర్ టాస్క్ ఫోర్స్ (CCS), గోషామహల్ మరియు అఫ్జల్‌గంజ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో నకిలీ టీ పొడి, డిటర్జెంట్లు, మస్కిటో రీఫిల్స్‌ను విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు మార్చి 2వ తేదీన జరిపిన ఈ దాడుల్లో రాజస్థాన్‌కు చెందిన జయ రామ్ (30), కచ్వా సురేంద్ర (34), హనుమాన్ రామ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి భారీగా నకిలీ స్టాక్‌ను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన వస్తువులలో 1,340 రెడ్ లేబుల్ టీ ప్యాకెట్లు, 100 తాజ్ మహల్ టీ ప్యాకెట్లు, 950 టైడ్ ప్యాకెట్లు, 300 వీల్, 550 సర్ఫ్ ఎక్సెల్ ప్యాకెట్లతో పాటు 3,600 గుడ్ నైట్ మస్కిటో రీఫిల్స్ ఉన్నాయి. ప్రముఖ బ్రాండ్ల పేర్లతో నకిలీ ఉత్పత్తులను తయారు చేసి ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్న ఈ ముఠాపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలు వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.
