జమ్మికుంట, ఏప్రిల్ 15: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఫ్లైఓవర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. మృతి చెందిన వ్యక్తిని దుర్గకాలనీకి చెందిన పూరంశెట్టి తిరుపతి (39)గా పోలీసులు గుర్తించారు.
పట్టణ సీఐ వరగంటి రవి తెలిపిన వివరాల ప్రకారం, తిరుపతి ఎలక్ట్రిక్ బైక్పై పని నిమిత్తం వెళ్తుండగా, ఓవర్ టెక్ చేయబోయి అదుపుతప్పి డీసీఎం వ్యాన్ వెనుక టైరు కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన అనంతరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని డీసీఎం వాహనాన్ని, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
మృతుడికి భార్య సృజన, ఏడేళ్ల కూతురు, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచిన ఈ ఘటనపై స్థానికులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
