
ఐపీఎస్ అధికారుల సంఖ్యను 103కు పెంచండి: కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఐపీఎస్ అధికారుల కేటాయింపును ప్రస్తుతమున్న 83 నుంచి 103కు పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఢిల్లీ పర్యటనలో భాగంగా అమిత్ షాతో భేటీ అయిన ముఖ్యమంత్రి, రాష్ట్ర పోలీస్ వ్యవస్థ బలోపేతంపై చర్చించారు. 2016 తర్వాత 2021లో జరగాల్సిన క్యాడర్ రివ్యూ 2025లో జరిగిందని, అప్పుడు కేవలం ఏడుగురు అధికారులను మాత్రమే కేటాయించారని గుర్తుచేశారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో పాటు రాబోయే ‘ఫ్యూచర్ సిటీ’ కమిషనరేట్ దృష్ట్యా అదనపు అధికారుల అవసరం ఉందని వివరించారు. ముఖ్యంగా సైబర్ నేరాలు, డ్రగ్స్, వైట్ కాలర్ నేరాల సవాళ్లను ఎదుర్కోవడానికి ఐపీఎస్ అధికారుల సంఖ్య పెంచాలని కోరుతూ, 2026 క్యాడర్ రివ్యూను సకాలంలో చేపట్టాలని విన్నవించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మావోయిస్టుల లొంగుబాటు అంశంపై కూడా చర్చ జరిగింది. గత రెండేళ్లలో 591 మంది మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిశారని, అగ్రనేతల పునరావాసానికి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను అమిత్ షాకు వివరించారు. అలాగే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర నిధులు కేటాయించాలని కోరారు. ఈ సమావేశంలో సీఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, డీజీపీ శివధర్ రెడ్డి, అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్, ఐజీ సుమతి పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
