జమ్మికుంట: వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జగ్గయ్యపల్లి గ్రామంలో గురువారం రోజున నిర్వహించిన ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ చందు సందర్శించారు. ఈ సందర్భంగా శిబిరానికి వచ్చిన మహిళలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
డాక్టర్ చందు మాట్లాడుతూ, ప్రతి మంగళవారం, గురువారం ఆరోగ్య మహిళ శిబిరాలు నిర్వహించబడతాయని, వైద్యురాలి సూచన మేరకు సుమారు 56 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేయబడుతాయని తెలిపారు. ప్రతి మహిళ కనీసం మూడు నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవడం ఆరోగ్యానికి మంచిదని సూచించారు.
ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి అధిక ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా, సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, వేసవికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. వడదెబ్బ నివారణ, ‘డ్రై డే’ కార్యక్రమం ప్రాముఖ్యత, టిబి (క్షయవ్యాధి) నిరోధానికి 100 రోజుల ప్రణాళిక గురించి వివరించారు. ప్రతి మహిళ ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంఎల్హెచ్పి డాక్టర్ సంధ్యారాణి, హెల్త్ ఎడ్యుకేటర్లు పంజాల ప్రతాప్ గౌడ్, ఏ. మోహన్ రెడ్డి, సూపర్వైజర్ కుసుమ కుమారి, ఆరోగ్యశాఖ సిబ్బంది శ్యామల, రామకృష్ణ, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
