అమెరికా పౌరులే టార్గెట్.. మూడు నకిలీ కాల్ సెంటర్లపై ఈడీ దాడులు

హైదరాబాద్: అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని అంతర్జాతీయ సైబర్ మోసాలకు పాల్పడుతున్న నకిలీ కాల్ సెంటర్ల నెట్‌వర్క్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) హైదరాబాద్ జోనల్ కార్యాలయం అధికారులు గుర్తించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద సెప్టెంబర్ 15న పంజాబ్‌లోని పాటియాలా, మహారాష్ట్రలోని పుణే, చండీగఢ్‌లలోని నాలుగు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
220 మంది సిబ్బందితో కాల్ సెంటర్లు
సోదాల్లో మూడు యాక్టివ్ నకిలీ కాల్ సెంటర్లు నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఆయా కేంద్రాల్లో సుమారు 220 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు వెల్లడైంది. అమెరికా పౌరులకు ఫోన్లు చేసి, తాము ప్రముఖ కంపెనీలు లేదా ప్రభుత్వ సంస్థల ప్రతినిధులమని పరిచయం చేసుకుని మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. భయభ్రాంతులకు గురిచేసి బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు ఈడీ తెలిపింది.
మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం
సోదాల సందర్భంగా 66 మొబైల్ ఫోన్లు, 13 ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డ్రైవ్‌లు, కమ్యూనికేషన్‌కు సంబంధించిన పరికరాలు, కీలక పత్రాలు, నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాల్ సెంటర్ల నిర్వహణకు పెద్ద సంఖ్యలో కంప్యూటర్లు, ఫోన్లు, హెడ్సెట్లు, నెట్వర్కింగ్ పరికరాలను ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు.
చండీగఢ్ నుంచి కార్యకలాపాల నియంత్రణ
చండీగఢ్‌లోని ఓ నివాసం నుంచి పాటియాలాలోని కాల్ సెంటర్ల కార్యకలాపాలను ముఠా ప్రధాన సూత్రధారి నియంత్రిస్తున్నట్లు దర్యాప్తులో తేలినట్లు ఈడీ పేర్కొంది. అమెరికా నుంచి మోసపూరితంగా వచ్చిన డాలర్లను భారత కరెన్సీగా మార్చే వ్యవహారంలో సంబంధం ఉన్న వ్యక్తిని కూడా చండీగఢ్‌లో గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
ఈ నెట్‌వర్క్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, మోసాల ద్వారా సమకూరిన నిధుల ప్రవాహం, ఇతర వ్యక్తుల పాత్రపై ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
