హన్మకొండలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. ఆర్టీసీ బస్సుకు చుట్టుకున్న వైర్లు.. కూలిన భారీ చెట్టు

హన్మకొండ: నగరంలోని పబ్లిక్ గార్డెన్స్ మలుపు వద్ద మంగళవారం భారీ ప్రమాదం తృటిలో తప్పింది. సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు మలుపు తిరుగుతున్న సమయంలో విద్యుత్ వైర్లు బస్సుకు చుట్టుకోవడంతో పక్కనే ఉన్న భారీ వృక్షం వేళ్లతో సహా పెకలించి ఒక్కసారిగా బస్సుపై, రోడ్డుపై కూలిపోయింది.
ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. చెట్టు కింద పార్క్ చేసి ఉన్న రెండు బైకులు, మూడు ఆటోలు పూర్తిగా ధ్వంసమైనట్లు సమాచారం. అయితే బస్సులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.
బస్సు అతివేగంగా మలుపు తిరగడం వల్లే విద్యుత్ వైర్లు బస్సుకు చుట్టుకున్నాయని, ఆ వైర్లు చెట్టుకు ఉండటంతో బస్సు వేగానికి చెట్టు నేలకొరిగిందని ప్రత్యక్షంగా చూసిన వారు పేర్కొన్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగంపై ప్రయాణికులు ఆరోపణలు చేసినట్లు సమాచారం.
ప్రమాద సమాచారం అందుకున్న కాజీపేట ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కూలిన భారీ చెట్టును తొలగించి రోడ్డుపై నిలిచిపోయిన వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.
ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
