బస్సులో మర్చిపోయిన రూ.3 లక్షలు.. ప్రయాణికుడికి తిరిగి ఇచ్చిన టీజీఎస్ఆర్టీసీ కండక్టర్

షాద్‌నగర్: ప్రజా రవాణా సంస్థలో విధులు నిర్వహిస్తూ నిజాయితీ, బాధ్యతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు షాద్‌నగర్ డిపోకు చెందిన టీజీఎస్ఆర్టీసీ కండక్టర్ సరిత. బస్సులో ప్రయాణికుడు మర్చిపోయిన రూ.3 లక్షల నగదు ఉన్న బ్యాగ్‌ను గుర్తించి, ఎలాంటి స్వార్థానికి తావులేకుండా సురక్షితంగా అతనికి తిరిగి అప్పగించారు.
షాద్‌నగర్‌కు చెందిన వ్యాపారవేత్త జహంగీర్ తన భార్యతో కలిసి హజ్ యాత్రకు వెళ్లేందుకు శనివారం బస్సులో హైదరాబాద్‌కు బయలుదేరారు. అఫ్జల్‌గంజ్ వద్ద బస్సు దిగిన అనంతరం ఆయన నాంపల్లి వైపు వెళ్లారు. కొంతసేపటి తర్వాత తన వద్ద ఉండాల్సిన రూ.3 లక్షల నగదు బ్యాగ్ బస్సులోనే మర్చిపోయినట్లు గుర్తించారు.
ఇదే సమయంలో బస్సులో నగదు ఉన్న బ్యాగ్‌ను కండక్టర్ సరిత గుర్తించారు. వెంటనే డ్రైవర్ నరసింహులుకు సమాచారం అందించి, నగదును భద్రపరిచారు. ప్రయాణికుడు తిరిగి వస్తాడేమోనని వారు ఎదురుచూశారు.
బ్యాగ్ బస్సులోనే మిగిలిపోయిందని గుర్తించిన జహంగీర్ ఆందోళనతో ప్రైవేట్ వాహనంలో బస్‌స్టాండ్‌కు చేరుకున్నారు. దీంతో కండక్టర్ సరిత, డ్రైవర్ నరసింహులు ఆయనను గుర్తించి, బస్సులో మర్చిపోయిన రూ.3 లక్షల నగదు ఉన్న బ్యాగ్‌ను పూర్తి మొత్తంతో సురక్షితంగా తిరిగి అందజేశారు.
నగదు తిరిగి లభించడంతో జహంగీర్ ఊపిరిపీల్చుకున్నారు. కండక్టర్ సరిత, డ్రైవర్ నరసింహుల నిజాయితీని పలువురు అభినందించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశంసలు
ఈ విషయం తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి వెళ్లింది. కండక్టర్ సరిత చూపిన నిజాయితీ, బాధ్యతాయుత వైఖరిని మంత్రి ప్రశంసించారు. ప్రజలతో నిత్యం మమేకమై సేవలందించే ఆర్టీసీ సిబ్బందిలో ఇలాంటి నిజాయితీ సంస్థకు మంచి పేరు తీసుకువస్తుందని పేర్కొన్నారు.
ప్రయాణికుడి నగదును సురక్షితంగా తిరిగి అందించిన సరిత నిజాయితీ, మానవత్వం ఇతర ఆర్టీసీ ఉద్యోగులకు స్ఫూర్తిగా నిలవాలని మంత్రి ఆకాంక్షించారు. షాద్‌నగర్ డిపో అధికారులు కూడా కండక్టర్ సరితను అభినందించారు.
రూ.3 లక్షల నగదు దొరికినా స్వప్రయోజనానికి ఉపయోగించుకోకుండా ప్రయాణికుడికి తిరిగి అప్పగించడం ద్వారా సరిత, నరసింహులు ఆర్టీసీ ఉద్యోగుల బాధ్యతాయుత సేవలకు మరోసారి నిదర్శనంగా నిలిచారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
