కౌన్సిలర్ వేధింపుల ఆరోపణలు.. పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

హుజూరాబాద్, ఆగస్టు 30 (జిందగీ9 న్యూస్):
స్థానిక కౌన్సిలర్ వేధింపులు భరించలేక ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన హుజూరాబాద్ పట్టణంలో కలకలం రేపింది. ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.
కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డుకు చెందిన గోస్కుల సత్యనారాయణ నూతనంగా ఇంటి నిర్మాణం చేపట్టారు. అయితే, అదే వార్డు కౌన్సిలర్ గోస్కుల రాజ్‌కుమార్ గత నాలుగు నెలలుగా భవన నిర్మాణాన్ని అడ్డుకుంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని సత్యనారాయణ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో మున్సిపల్ సిబ్బందిని పంపించి నిర్మాణ సామగ్రిని సీజ్ చేయించడం, పనులను నిలిపివేయించడం వంటి చర్యలతో వేధింపులకు గురిచేశారని వారు పేర్కొన్నారు. ఈ విషయంపై గతంలో మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని, మున్సిపల్ కమిషనర్ కిషన్‌తో పాటు స్థానికుల వద్ద సత్యనారాయణ తన సమస్యను పలుమార్లు చెప్పుకున్నట్లు తెలిపారు.
వేధింపులు కొనసాగితే ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన సత్యనారాయణ శనివారం సాయంత్రం హుజూరాబాద్‌లోని బతుకమ్మ సౌడ్ల వద్దకు వెళ్లి పురుగుల మందు తాగినట్లు సమాచారం. గమనించిన స్థానికులు వెంటనే అతడిని హుజూరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం బంధువులు జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం సత్యనారాయణకు చికిత్స కొనసాగుతుండగా, ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన వీడియోలు, వివరాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది.
అయితే, ఈ ఆరోపణలపై కౌన్సిలర్ రాజ్‌కుమార్ వివరణ తెలుసుకునేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. ఘటనపై పూర్తి వివరాలు, పోలీసుల దర్యాప్తు అనంతరం మరిన్ని విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
