రైళ్లలో మత్తు నీళ్లు.. ప్రయాణికులే టార్గెట్
ఇద్దరు నిందితుల అరెస్ట్.. మత్తు మాత్రలు, నగదు స్వాధీనం

సికింద్రాబాద్, ఆగస్టు 29: రైళ్లలో ప్రయాణికులతో పరిచయం పెంచుకుని మత్తు పదార్థాలు కలిపిన నీటిని ఇచ్చి, వారు అపస్మారక స్థితికి చేరిన అనంతరం లగేజీ చోరీ చేస్తున్న ఇద్దరు నిందితులను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి మత్తు మాత్రలు, నగదుతో పాటు మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. బత్త ప్రసాద్‌రెడ్డి (39), కొరపాటి నర్సింహారావు (44) రైళ్లలో ఒంటరిగా ప్రయాణించే వారిని లక్ష్యంగా చేసుకునేవారు. ముందుగా ప్రయాణికులతో మాటలు కలిపి స్నేహం చేసుకుని, అనంతరం మత్తు పదార్థాలు కలిపిన నీటిని ఇచ్చేవారని పోలీసులు తెలిపారు.
ఆగస్టు 17న శబరి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తితో నిందితులు పరిచయం పెంచుకుని మత్తు కలిపిన నీటిని ఇచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. బాధితుడు మత్తులోకి జారుకున్న తర్వాత అతడి లగేజీలోని విలువైన వస్తువులను అపహరించినట్లు పోలీసులు గుర్తించారు.
దర్యాప్తులో భాగంగా నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి ఒప్పో మొబైల్ ఫోన్, 10 మత్తు మాత్రలు, రూ.500 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇద్దరికి గతంలో జరిగిన ఇతర రైలు చోరీలతో ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
