వేపచెట్టు వివాదం.. గొడ్డళ్లతో దాడి, ఇద్దరి మృతి

సూర్యాపేట, ఆగస్టు 29 (జిందగీ9న్యూస్): ఇంటి పక్కన ఉన్న వేపచెట్టు విషయంలో చాలాకాలంగా కొనసాగుతున్న వివాదం ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, పోలీసు అధికారి కూడా గాయపడ్డారు.
మేళ్లచెరువు మండలం ఎర్రగట్టుతండాలో శనివారం వేపచెట్టు విషయంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. ఈ క్రమంలో గొడ్డళ్లతో దాడి చేయడంతో మంద వెంకటేశ్వర్లు (62) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన సైదా (58)ను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు సమాచారం.
ఘటనపై సమాచారం అందుకున్న మేళ్లచెరువు ఎస్సై నవీన్‌కుమార్ అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా, ఆయనపై కూడా దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎస్సై తలకు గాయాలయ్యాయి.
కేసు నమోదు చేసిన పోలీసులు భూక్యా రామును అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఘర్షణకు దారితీసిన కారణాలు, మరికొందరి ప్రమేయం ఉందా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
