నకిలీ క్యాటరింగ్ కాంట్రాక్టుల పేరుతో హాస్టల్ యజమానులకు మోసం

హన్మకొండ: నకిలీ క్యాటరింగ్ కాంట్రాక్టుల పేరుతో హాస్టల్ యజమానులను మోసం చేస్తున్న వ్యక్తిని హన్మకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, IPS వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. మహమ్మద్ షబ్బీర్ అలియాస్ కిరణ్ కుమార్ అలియాస్ శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి ప్రముఖ కంపెనీలో ఉద్యోగినని పరిచయం చేసుకున్నాడు. హాస్టళ్లకు క్యాటరింగ్ కాంట్రాక్టులు ఇప్పిస్తానని నమ్మించి పలువురు హాస్టల్ యజమానుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడిపై వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే 10 కేసులు, ఇతర జిల్లాల్లో 7 కేసులు నమోదై ఉన్నాయని వెల్లడించారు. అలాగే సైబర్ క్రైమ్ పోర్టల్‌లో అతనిపై 6 ఫిర్యాదులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ మోసాల కారణంగా బాధితులకు మొత్తం రూ.36.99 లక్షల నష్టం జరిగినట్లు గుర్తించారు. ఇందులో రూ.13.09 లక్షలను ‘పుట్ ఆన్ హోల్డ్’ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
నిందితుడి నుంచి 3 మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, పాస్‌బుక్స్, ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు కమిషనర్ తెలిపారు. నిందితుడి మోసాలపై మరింత దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు.
క్యాటరింగ్ కాంట్రాక్టులు, ఉద్యోగాలు లేదా ఇతర వ్యాపార అవకాశాల పేరుతో ఎవరైనా డబ్బులు కోరితే పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే చెల్లింపులు చేయాలని పోలీసులు ప్రజలకు సూచించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
