జమ్మికుంట వారసంత మార్పుతో గందరగోళం.. వ్యాపారులకు నష్టం, స్థానికుల అభ్యంతరం

జమ్మికుంట, ఆగస్టు 25 (జిందగీ9న్యూస్): జమ్మికుంట పట్టణంలో ప్రతి మంగళవారం నిర్వహించే వారసంతను కొత్త ప్రాంతానికి తరలించడంపై వ్యాపారులు, స్థానికుల మధ్య గందరగోళ పరిస్థితి నెలకొంది. వివిధ గ్రామాల నుంచి సంతకు వచ్చిన వ్యాపారులు, కూరగాయల చిరు వ్యాపారులు కొత్త ప్రాంతంలో దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నించగా.. అక్కడి ఇళ్ల యజమానులు, షాపుల నిర్వాహకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
తమ ఇళ్ల ముందు, షాపుల ముందు సంత పెట్టేందుకు వీలులేదని స్థానికులు స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో వ్యాపారులు ఎక్కడ విక్రయాలు చేయాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో కొందరు వ్యాపారులకు, అధికారులకు మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలిసింది.
మరోవైపు కొత్త ప్రాంతంలో కస్టమర్లు పెద్దగా రాకపోవడంతో అక్కడ వ్యాపారం చేసేందుకు వెళ్లిన కొంతమంది కూరగాయల చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. అమ్మకాలు లేకపోవడంతో తీసుకొచ్చిన కూరగాయలు పాడయ్యే పరిస్థితి ఏర్పడగా, కొంతమంది వ్యాపారులు అమ్ముడుపోని కూరగాయలను పారబోయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
“ముందుగా సమాచారం ఇవ్వకుండా ఒక్కసారిగా సంత ప్రదేశం మార్చడంతో మా వ్యాపారం దెబ్బతింది. కస్టమర్లు రాక కూరగాయలు అమ్ముడుపోలేదు. ఒక్కరోజులోనే నష్టపోయాం” అని పలువురు వ్యాపారులు వాపోయారు.
ఇదిలా ఉండగా, కొండూరి కాంప్లెక్స్ పరిసరాల్లో వారసంత నిర్వహణతో పాఠశాలలు, ఆసుపత్రులు, బొమ్మలగుడి ప్రాంత ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. వర్షాల సమయంలో ఆ ప్రాంతాలు బురదమయంగా మారుతున్న నేపథ్యంలో వారసంతను పాత వ్యవసాయ మార్కెట్ రోడ్డుకు తరలించే ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
కొత్త ప్రాంతంలో లైటింగ్, పారిశుధ్యం, చెట్ల కొమ్మల తొలగింపు వంటి ఏర్పాట్లు చేసినప్పటికీ.. స్థానికులు సంతకు స్థలం ఇవ్వకపోవడం, వ్యాపారులకు కస్టమర్లు రాకపోవడం వంటి సమస్యలు ఎదురవడంతో వారసంత మార్పు నిర్ణయం తొలిరోజే వివాదాస్పదంగా మారింది.
వ్యాపారులు, స్థానికులు, అధికారులు పరస్పరం చర్చించుకుని అందరికీ ఇబ్బంది లేకుండా వారసంతకు అనువైన స్థలాన్ని ఖరారు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
