నకిలీ డిగ్రీలతో వైద్యం.. 11 మంది ఫేక్ డాక్టర్ల అరెస్ట్

హైదరాబాద్: నగరంలో నకిలీ వైద్యుల దందాపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు కొరడా ఝళిపించారు. జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో 11 మంది నకిలీ డాక్టర్లతో పాటు ఓ మెడికల్ షాప్ యజమానిని అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. నిందితులు గుర్తింపు పొందిన వైద్య అర్హతలు లేకుండానే నకిలీ డిగ్రీలు, డాక్టర్ సర్టిఫికెట్లను ఉపయోగిస్తూ వైద్యులుగా చలామణి అవుతున్నారు. పలు ప్రాంతాల్లో క్లినిక్‌లు నిర్వహిస్తూ రోగులకు వైద్యం చేస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు.
దాడుల సందర్భంగా నిందితుల వద్ద నుంచి డాక్టర్ల పేర్లతో ఉన్న ప్రిస్క్రిప్షన్ ప్యాడ్లు, రబ్బర్ స్టాంపులు, నకిలీ వైద్య ధ్రువపత్రాలు, భారీగా మందులు, గ్లూకోజ్ బాటిళ్లు, వైద్య పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు రోజుకు సుమారు 50 నుంచి 100 మంది వరకు రోగులకు చికిత్స అందిస్తూ, ఒక్కో రోగి నుంచి రూ.50 నుంచి రూ.200 వరకు ఫీజు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ వ్యవహారంపై నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ముదరంగర్ పరిధిలో రెండు, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, బోరబండ, రామ్‌గోపాల్‌పేట్, డోమల్గూడలో ఒక్కో కేసు, చిక్కడపల్లి, ఓల్డ్ సిటీలో రెండేసి కేసులు నమోదైనట్లు సమాచారం.
నకిలీ సర్టిఫికెట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ వ్యవహారం వెనుక మరెవరైనా ఉన్నారా? నిందితులు ఎంతకాలంగా వైద్యం చేస్తున్నారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ప్రజలకు పోలీసుల సూచన: వైద్యం చేయించుకునే ముందు డాక్టర్ విద్యార్హతలు, వైద్య రిజిస్ట్రేషన్ వివరాలను నిర్ధారించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
