దేశంలో త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. రూ.10, రూ.20 నోట్లతో పైలట్ ప్రారంభం
రూ.10, రూ.20 పాలిమర్ నోట్లకు కేంద్రం ఆమోదం
ఫీల్డ్ ట్రయల్స్ అనంతరం సాధారణ చలామణిలోకి
ప్రస్తుత కాగితపు నోట్లు కొనసాగుతాయని కేంద్రం స్పష్టం

న్యూఢిల్లీ, జూలై 28 (Zindagi9News): దేశంలో పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్ల ప్రవేశానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రతిపాదన మేరకు తొలిదశలో రూ.10, రూ.20 విలువ కలిగిన పాలిమర్ నోట్లను ఫీల్డ్ ట్రయల్స్ కోసం విడుదల చేయనున్నారు. ట్రయల్స్ విజయవంతమైతే ఈ నోట్లను సాధారణ చలామణిలోకి తీసుకురానున్నారు.
లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు. అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారం పాలిమర్ నోట్ల జీవితకాలం కాగితపు నోట్ల కంటే ఎక్కువగా ఉంటుందని, ప్రస్తుతం ఈ ప్రక్రియ ప్రాథమిక దశలో ఉందని తెలిపారు.
అయితే ప్రస్తుత కాగితపు కరెన్సీని పూర్తిగా తొలగించే ప్రతిపాదన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పాలిమర్ నోట్లు, కాగితపు నోట్లు రెండూ సమాంతరంగా చలామణిలో ఉంటాయని పేర్కొంది. అలాగే డిజిటల్ చెల్లింపులపై వీటి ప్రభావం ఫీల్డ్ ట్రయల్స్ పూర్తైన తర్వాతే అంచనా వేయగలమని వెల్లడించింది.
