రూ.25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

ఖమ్మం, జూన్ 27 (జిందగీ9న్యూస్): ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం భానాపురం గ్రామపంచాయతీ కార్యదర్శి తమ్మిశెట్టి సురేష్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. ఇంటి నిర్మాణానికి బిల్డింగ్ అనుమతి మంజూరు చేయడం, ఇంటి నంబర్ కేటాయించడం కోసం ఫిర్యాదుదారుని నుంచి రూ.25,000 లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా ఖమ్మం రేంజ్ ఏసీబీ అధికారులు శనివారం వల పన్ని పట్టుకున్నారు. ముదిగొండ మండలంలోని రైతు వేదిక సమీపంలో లంచం స్వీకరిస్తున్న సమయంలో అధికారులు దాడి చేసి నిందితుడి వద్ద నుంచి రూ.25 వేల లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధికారిక విధులను దుర్వినియోగం చేసి అక్రమ లాభం పొందేందుకు లంచం తీసుకున్నట్లు ఏసీబీ వెల్లడించింది. అనంతరం నిందితుడిని అరెస్టు చేసి వరంగల్‌లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు తెలిపింది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచినట్లు ఏసీబీ పేర్కొంది. ప్రజాసేవకులు ఎవరైనా లంచం కోరితే టోల్‌ఫ్రీ నంబర్ 1064కు సమాచారం అందించాలని ఏసీబీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
