తనిఖీల్లో విషాదం.. టిప్పర్ ఢీకొని డీటీవో వెంకన్న మృతి
భూపాలపల్లిలో ఘోర ప్రమాదం.. డ్రైవర్ అదుపులోకి

భూపాలపల్లి, జూన్ 22(Zindagi9news): వాహనాలు తనిఖీ చేస్తున్న జిల్లా రవాణా శాఖాధికారి (డీటీవో) వెంకన్నను బొగ్గు టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ శివారులోని ఆర్టీవో కార్యాలయం ఎదుట పరకాల-భూపాలపల్లి జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ప్రమాదంలో వెంకన్న మృతదేహం నుజ్జునుజ్జు కావడంతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కేవలం 15 రోజుల క్రితమే బదిలీపై భూపాలపల్లికి వచ్చిన వెంకన్న విధి నిర్వహణలో ఉండగానే ఈ విషాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. టిప్పర్ లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
