
ఆరోపణలు నిరాధారం.. న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం: బండి సంజయ్
హైదరాబాద్: ఇటీవల తనపై వస్తున్న ఆరోపణలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. తన ప్రజా జీవితమంతా చట్టాన్ని గౌరవిస్తూ, రాజ్యాంగానికి కట్టుబడి పనిచేశానని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రకటన విడుదల చేశారు.
తనపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొంటూ, “నా ప్రజా జీవితంలో ఎలాంటి మచ్చ లేకుండా జీవించాను. న్యాయవ్యవస్థపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. నిజం ఏదో, తప్పు ఏదో కోర్టులు తేలుస్తాయి” అని తెలిపారు.
రాజకీయంగా ఎదుర్కోలేని వారు తన కుటుంబ సభ్యులను, పిల్లలను వివాదాల్లోకి లాగడం వారి నిరాశను సూచిస్తోందని బండి సంజయ్ విమర్శించారు. “గ్రాస్‌రూట్ స్థాయి నుంచి కార్పొరేటర్‌గా ప్రారంభమై, ప్రజల మద్దతుతో క్రమంగా కేంద్ర మంత్రిగా ఎదిగిన బీసీ నాయకుడి ఎదుగుదలను కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు” అని వ్యాఖ్యానించారు.
ఇది రాజకీయ కక్షసాధింపు చర్యలో భాగమని, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రజా సభకు ముందు తన ప్రతిష్ఠను దెబ్బతీయాలనే కుట్రగా భావిస్తున్నానని ఆరోపించారు.
“కాలమే ప్రతి ఆరోపణకు సమాధానం చెబుతుంది. ప్రతి కుట్రను బయటపెడుతుంది” అంటూ ‘సత్యమేవ జయతే’ అని తన ప్రకటనను ముగించినట్లు బండి సంజయ్ ఎక్స్ (ట్విట్టర్) ద్వారా తెలిపారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
