
అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసుల ఉక్కుపాదం: ఆదిలాబాద్ జిల్లాలో భారీ దాడులు
ఆదిలాబాద్: జిల్లాలో సామాన్య ప్రజలను అధిక వడ్డీలతో వేధిస్తున్న అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ పోలీసులు భారీ స్థాయిలో మెరుపు దాడులు చేపట్టారు.
జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సుమారు 45 పోలీసు బృందాలు ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. ఈ ఆపరేషన్లో భాగంగా 16 మండలాలు, 15 పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్న వ్యక్తులపై 15 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
దాడుల సమయంలో పెద్ద ఎత్తున ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్కులు, భూములకు సంబంధించిన పట్టా పత్రాలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు వంటి కీలక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పత్రాల ఆధారంగా అక్రమంగా భూ కబ్జాలు, అధిక వడ్డీ దోపిడీలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరిస్తూ, నిరుపేదల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలతో దోపిడీ చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమన్నారు. ఎవరైనా ఇలాంటి వడ్డీ వ్యాపారుల వేధింపులకు గురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని ప్రజలకు సూచించారు.
