జమ్మికుంటలో విషాదం: అదుపుతప్పి ఆటో పల్టీ.. డ్రైవర్ అక్కడికక్కడే మృతి

జమ్మికుంట, ఏప్రిల్ 02(Zindagi9News): కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజరాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన తేలుకుంట్ల శ్రీనివాస్ వృత్తిరీత్యా ఆటో డ్రైవర్. ఈరోజు తన ఆటోలో జమ్మికుంట నుండి పోతిరెడ్డిపేటకు బయలుదేరారు. మార్గమధ్యలో పెద్దంపల్లి క్రాస్ రోడ్ సమీపంలో ఉన్న మలుపు వద్ద ఆటో ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.ఆటో పల్టీలు కొట్టడంతో శ్రీనివాస్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, అతడిని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే శ్రీనివాస్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రమాద సమయంలో ఆటోలో శ్రీనివాస్ మినహా ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.మృతుడు పోతిరెడ్డిపేట నివాసి కావడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
