
హుజురాబాద్ పురపాలక బడ్జెట్‌కు ఆమోదం: రూ. 30.69 కోట్లతో వార్షిక ప్రణాళిక
- డంపింగ్ యార్డ్ ప్రతిపాదన రద్దు: ప్రజల విన్నపానికి పాలకవర్గం మొగ్గు
- కోతుల బెడద నివారణకు రూ. 4 లక్షల కేటాయింపు..
- రూ. 14.50 కోట్లతో కొత్త రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ప్రతిపాదనలు
హుజురాబాద్, మార్చి 30: హుజురాబాద్ పురపాలక సంఘం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 30,69,35,000 (ముప్పై కోట్ల అరవై తొమ్మిది లక్షల ముప్పై ఐదు వేల రూపాయల) అంచనా వ్యయంతో కూడిన బడ్జెట్‌ను ఏకగ్రీవంగా ఆమోదించింది. సోమవారం మున్సిపల్ చైర్పర్సన్ సుహాసినీ రొంటాల అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఎస్. ఆరతి ఈ బడ్జెట్ వివరాలను ప్రవేశపెట్టారు.
ముఖ్యమైన కేటాయింపులు మరియు ఆదాయ వనరులు:
మున్సిపాలిటీకి వచ్చే ఆదాయంలో ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వాటా రూ. 19.45 కోట్లు కాగా, ఆస్తి పన్నుల ద్వారా రూ. 3.29 కోట్లు, భవన నిర్మాణాల (LRS) ద్వారా రూ. 4.95 కోట్లు వస్తాయని అంచనా వేశారు. వ్యయం పరంగా అవుట్సోర్సింగ్ సిబ్బంది జీతాలకు రూ. 3.72 కోట్లు, పారిశుద్ధ్య నిర్వహణకు రూ. 2.12 కోట్లు కేటాయించారు.
సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు:
సమావేశంలో మొత్తం 26 అంశాలను చర్చించి ఆమోదించారు. వాటిలో ప్రధానమైనవి:
🔹 డంపింగ్ యార్డ్ రద్దు: హుజురాబాద్ పట్టణానికి సమీపంలో నిర్మించతలపెట్టిన ఎనర్జీ ప్లాంట్ (డంపింగ్ యార్డు) ప్రతిపాదనను ప్రజల విజ్ఞప్తి మేరకు వెంటనే నిలిపివేయాలని పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది. దీనికి ప్రధమ ప్రాధాన్యతనిచ్చారు.
🔹 మౌలిక సదుపాయాల అభివృద్ధి: పట్టణంలో రోడ్ల నిర్మాణానికి రూ. 7.50 కోట్లు, డ్రైనేజీల (మురికి కాలువలు) కోసం రూ. 6.00 కోట్లు, కొత్త విద్యుత్ స్తంభాలు మరియు లైట్ల ఏర్పాటుకు రూ. 1.00 కోటి నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు.
🔹 కోతుల బెడదకు చెక్: పట్టణంలోని 30 వార్డులలో కోతుల సమస్య తీవ్రంగా ఉన్నందున, వాటిని పట్టుకుని అడవి ప్రాంతాలకు తరలించేందుకు రూ. 4 లక్షలు కేటాయించారు.
🔹సిబ్బంది రిన్యూవల్: కాలపరిమితి ముగిసిన అవుట్సోర్సింగ్ సిబ్బందిని 2026-27 ఏడాదికి గాను తిరిగి కొనసాగించేందుకు (రిన్యూవల్) ఆమోదం తెలిపారు.
🔹 తై-బజార్ వేలం: వచ్చే ఏడాదికి తై-బజార్ రుసుముల వసూలు హక్కును బహిరంగ వేలంలో రూ. 24,21,000లకు దక్కించుకున్న భూం రామకృష్ణ టెండర్‌ను కౌన్సిల్ ఖరారు చేసింది.
ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గూడూరి అంజలి, కమిషనర్ ముసాబ్ అహ్మద్ సయ్యద్, మేనేజర్ భూపాల్ రెడ్డి, ఏఈ సుధాకర్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్, టీపీఎస్ అశ్వినీ గాంధీ మరియు ఇతర కౌన్సిల్ సభ్యులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
