Zindagi9News ఇంపాక్ట్: ఫ్లైఓవర్‌పై కదిలిన యంత్రాంగం.. మరి గాంధీ చౌరస్తా మాటేమిటి?
వార్తకు స్పందించి వంతెనపై ఫ్లెక్సీల తొలగింపు.. అదే రీతిలో మహాత్ముడి విగ్రహాన్ని విడిపించాలని కోరుతున్న ప్రజలు

జమ్మికుంట, మార్చి 30 (Zindagi9News ప్రతినిధి):
జమ్మికుంట పట్టణ సమస్యలపై Zindagi9News ఎక్కుపెట్టిన విమర్శనాస్త్రం సత్ఫలితాలను ఇస్తోంది. ఫ్లైఓవర్‌పై అడ్డదిడ్డంగా వెలిసిన ఫ్లెక్సీల వల్ల వాహనదారుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందన్న మా కథనానికి మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించారు. యుద్ధ ప్రాతిపదికన వంతెన రైలింగ్‌కు ఉన్న అక్రమ హోర్డింగ్‌లను తొలగించి, మార్గాన్ని సుగమం చేశారు. అధికారుల ఈ తక్షణ స్పందనపై పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గాంధీ చౌరస్తాపై ఎప్పుడు స్పందిస్తారు?
ఫ్లైఓవర్‌పై ఫ్లెక్సీలను తొలగించిన అధికారులు, అదే వేగంతో పట్టణ లో ఉన్న గాంధీ చౌరస్తా (గాంధీ సెంటర్) వైపు కూడా దృష్టి సారించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా భారీ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌ల ధాటికి సాక్షాత్తూ జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం ప్రజలకు కనిపించకుండా మరుగున పడిపోయింది. విగ్రహం చుట్టూ ఉన్న రౌండానాను ప్రచార బోర్డులు కమ్మేయడంతో.. జాతిపితకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒకే నిబంధన.. అందరికీ వర్తించాలి!
వంతెనపై భద్రతా కారణాలతో ఫ్లెక్సీలను తొలగించినట్లే, జంక్షన్ల వద్ద కూడా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని Zindagi9News అధికారులను కోరుతోంది. ప్రధాన కూడళ్లలో విగ్రహాలను కప్పేస్తూ బోర్డులు పెట్టడం చట్టరీత్యా తప్పని, వెంటనే గాంధీ చౌరస్తాలో కూడా అక్రమ ఫ్లెక్సీలను తొలగించి మహాత్ముడి విగ్రహానికి మర్యాద దక్కేలా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
