
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీలకు గాడిద గుడ్డే
బీజేపీకి అప్పగిస్తే పన్నుల్లేకుండా ఢిల్లీ నుంచి నిధులు తెస్తాం
జమ్మికుంట రూపురేఖలు మార్చే బాధ్యత నాది
జమ్మికుంట, Zindagi9News: రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీలకు ప్రభుత్వం ఇచ్చింది గాడిద గుడ్డేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. పొరపాటున కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఇంటి పన్ను, నల్లా పన్ను, వ్యాపార పన్నులు పెంచడం ఖాయమని హెచ్చరించారు. ఖజానా కోసం రోడ్డుపై నడవాలన్నా ట్యాక్స్ వేసే పరిస్థితి తెస్తారని ఆరోపించారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం జమ్మికుంట పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో బండి సంజయ్ పాల్గొని ప్రసంగించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి క్రిష్ణారెడ్డి, ఎన్నికల ఇన్ఛార్జ్ ఎర్రం మహేశ్‌తో పాటు స్థానిక నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
🔹కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలో జమ్మికుంటకు అభివృద్ధి జరగలేదని, ఓట్లు వేయించుకోవడమే తప్ప నయాపైసా కేటాయించలేదన్నారు.
🔹బీఆర్ఎస్పై కోపంతో కాంగ్రెస్‌కు ఓట్లు వేసినా ఫలితం లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. మహిళలకు రూ.2500, తులం బంగారం, స్కూటీ వంటి హామీలు అమలు కాలేదని విమర్శించారు.
🔹పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చిన వెంటనే ప్రధాని వద్దకు వెళ్లి పంచాయతీలకు రూ.259 కోట్ల నిధులు తీసుకొచ్చామని తెలిపారు.
🔹14, 15వ ఆర్థిక సంఘాల ద్వారా రూ.8.23 కోట్లు, అమృత్ ద్వారా రూ.33 కోట్లు, స్వనిధి ద్వారా 4,587 మందికి రూ.8.45 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు.
🔹ఖేలో ఇండియా కింద సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్‌కు రూ.6.50 కోట్లు, ప్రభుత్వ పాఠశాలల టెన్త్ విద్యార్థులకు ఉచిత సైకిళ్లు, పరీక్ష ఫీజు చెల్లింపులు జరిగాయని వివరించారు.
🔹సీఎస్సార్, ఎంపీ లాడ్స్ నిధులతో జమ్మికుంట ఆసుపత్రికి రూ.2 కోట్ల మెడికల్ ఎక్విప్మెంట్ తెచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్లు, సిబ్బంది నియామకంలో విఫలమైందని ఆరోపించారు.
బీజేపీ హామీలు
🔸మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే నాయిని చెరువును రిజర్వాయర్‌గా అభివృద్ధి చేసి బోటింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు.
🔸పట్టణ ఆస్తుల విలువ పెంచేలా అభివృద్ధి చేస్తామని, వ్యాపారాలు బలోపేతం అయ్యేలా బొడ్రాయి ఏర్పాటు చేస్తామని తెలిపారు.
🔸జమ్మికుంట రైల్వే స్టేషన్‌ను కరీంనగర్ తరహాలో ఆధునీకరించి ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ఎస్కలేటర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
🔸జమ్మికుంటను కూరగాయల హబ్‌గా తీర్చిదిద్దుతామని, అన్ని వార్డుల్లో ఇంటర్నల్ రోడ్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
🔸లోతట్టు ప్రాంతాల్లో మురుగు కాల్వ సమస్యను ముందస్తు ప్రణాళికతో పరిష్కరిస్తామని తెలిపారు.
🔸కేంద్ర నిధులతో అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు, పీఎం ఆవాస్ యోజన కింద పేదలకు ఇండ్ల మంజూరుకు కృషి చేస్తామని వెల్లడించారు.
చివరగా, మోసపు హామీలు తమకు రావని, మాట ఇస్తే నెరవేర్చే వరకు విశ్రమించబోమని స్పష్టం చేశారు. మంచి పాలన కోసం ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని, మున్సిపాలిటీలను బీజేపీకి అప్పగించాలని ప్రజలను బండి సంజయ్ కోరారు.
